logo

చేపా.. చేపా.. ఎందుకు చిక్కలేదు?

ఆక్వా హబ్‌లు అందుబాటులోకి రాలేదు. మినీ రిటైల్‌ ఔట్‌లెట్లు తెరుచుకోలేదు. వెరసి వినియోగదారులకు తాజా చేపలు.. రొయ్యలు అందుబాటులోకి రాలేదు. ఇదండీ.. ఫిష్‌ ఆంధ్ర ప్రాజెక్టు పరిస్థితి. కాకినాడ జిల్లాలో రెండు

Updated : 29 Sep 2022 06:31 IST

రిటైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్‌

న్యూస్‌టుడే, కాకినాడ నగరం: ఆక్వా హబ్‌లు అందుబాటులోకి రాలేదు. మినీ రిటైల్‌ ఔట్‌లెట్లు తెరుచుకోలేదు. వెరసి వినియోగదారులకు తాజా చేపలు.. రొయ్యలు అందుబాటులోకి రాలేదు. ఇదండీ.. ఫిష్‌ ఆంధ్ర ప్రాజెక్టు పరిస్థితి. కాకినాడ జిల్లాలో రెండు ఆక్వా హబ్‌లు, 294 మినీ ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ ఏడాది జూన్‌ 22 నాటికి వీటిని ప్రారంభించాల్సి ఉంది. ప్రచారం లేకపోవడం, మత్స్యకారుల నుంచి ఆదరణ లభించకపోవడంతో ముందడుగు పడలేదు.

ఇదీ ఉద్దేశం..

జిల్లాలో మత్స్య ఉత్పత్తులు భారీగా ఉన్నా.. స్థానిక వినియోగం తక్కువగా ఉంది. ఎగుమతులు సరిగా లేక ఆక్వా రంగంలో ఉన్న రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లలో మత్స్య ఎగుమతులు నిలిచిపోయి భారీ నష్టాలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక వినియోగం ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. ఆ దృష్టితో ఫిష్‌ ఆంధ్ర ప్రాజెక్టు పేరుతో గ్రామానికి ఒక రిటైల్‌ ఔట్‌లెట్‌ ఏర్పాటుకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. జిల్లాలోని ఏలేశ్వరం, కాకినాడ ప్రాంతాల్లో రెండు ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. మరో రెండు ఆక్వా విలువ పెంపు యూనిట్లు, 10 ఫుడ్‌ కార్ట్‌లు, 294 మినీ రిటైల్‌ ఔట్‌లెట్ల ఏర్పాటుకు దరఖాస్తులు కోరారు. ఔట్‌లెట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీల వారికి రాయితీ రుణాలు అందజేస్తామని ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా.. జిల్లాలో ప్రతిపాదించిన ఆక్వా హబ్‌ల్లో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. రిటైల్‌ ఔట్‌లెట్ల విషయంలోనూ ఒక్క అడుగు కూడా పడలేదు.

ఇంకా దరఖాస్తు దశలోనే..

ఆక్వా హబ్‌ యూనిట్‌ వ్యయం రూ.1.20 కోట్లు, రిటైల్‌ ఔట్‌లెట్‌కు రూ.1.75 లక్షలుగా ఉంది. హబ్‌లకు వ్యయం ఎక్కువ కావటంతో వాటి ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. దాంతో ఇప్పుడిప్పుడే కొందరు దరఖాస్తులు అందిస్తున్నారు. లబ్ధిదారులకు హామీ లేని రుణాలు మంజూరు చేసేలా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో మత్స్యశాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు.


చర్యలు తీసుకుంటున్నాం..
- సత్యనారాయణ, కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి

జిల్లాలో ఫిష్‌ ఆంధ్ర ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా గ్రామానికి ఒక ఫిష్‌ రిటైల్‌ ఔట్‌లెట్‌ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం. ఇది ఔత్సాహిక వ్యాపారులకు మంచి అవకాశం. ప్రజలకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, సరసమైన ధరలకు అందుబాటులో లభిస్తాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నాం. తొలుత చాలా మంది ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు సంప్రదింపులు చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని