logo

కాదంటే..ఔననిలే!

కళ్లెదుట రూ.కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు.. అనుమతులు ఇస్తే తవ్వుకుపోవాలని చాలా మంది కాసుక్కూర్చున్నారు. దశాబ్దానికి పైగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మారింది.. నాయకుల రంగులూ మారాయి.. ఎట్టకేలకు రాయబేరాలు కొలిక్కివచ్చాయి. అధికారిక ఆశీస్సులు దక్కాయి. ఇంకేముంది.. అనుమతులకు పచ్చజెండా ఊపడంతో తవ్వకాలకు మార్గం సుగమమైంది.

Published : 30 Sep 2022 02:34 IST

ఈనాడు - కాకినాడ

ప్రత్తిపాడు: చింతలూరు ప్రాంతంలో గనుల తవ్వకాలకు అనువుగా ఏర్పాట్లు

కళ్లెదుట రూ.కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు.. అనుమతులు ఇస్తే తవ్వుకుపోవాలని చాలా మంది కాసుక్కూర్చున్నారు. దశాబ్దానికి పైగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మారింది.. నాయకుల రంగులూ మారాయి.. ఎట్టకేలకు రాయబేరాలు కొలిక్కివచ్చాయి. అధికారిక ఆశీస్సులు దక్కాయి. ఇంకేముంది.. అనుమతులకు పచ్చజెండా ఊపడంతో తవ్వకాలకు మార్గం సుగమమైంది.

కుదరదంతే...

అభయారణ్యానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం పచ్చదనంతో నిండింది. ఇక్కడ మైనింగ్‌ కార్యకలాపాలు సాగించాలంటే వృక్షాలు తొలగించాలి. ఇక్కడి తవ్వకాలతో వన్యప్రాణుల మనుగడకు విఘాతం కలుగుతుంది.. లేటరైట్‌ రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలు.. కాలుష్యంతో స్థానికుల ఆరోగ్యానికీ ఇబ్బందే. సమీప గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతుందనే భయం ఉంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని క్వారీ లీజులు మంజూరు చేయడం కుదరదు.

-ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామ సర్వే నంబర్‌-1లో గనుల తవ్వకం లీజు దరఖాస్తుపై అటవీశాఖ అభ్యంతరమిది..

(ఆర్‌సీ నంబర్‌: 3804/ 2017, తేదీ: 09.05.2018)

మైనింగ్‌ అనుమతులు మంజూరు చేయవద్దని చింతలూరు సచివాలయం ఎదుట ఆందోళన (పాతచిత్రం)

సరేలే.. తవ్వుకోండి..

ప్రత్తిపాడు మండలం చింతలూరులో లేటరైట్‌ తవ్వకాలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఒక లీజు మంజూరు చేయగా.. మరో నాలుగు లీజులకు అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యావరణ సంబంధిత అంశాలపై తాజాగా కాలుష్య నియంత్రణ మండలి గ్రామసభ నిర్వహించింది. ప్రజలు పెద్దగా రాకపోయినా.. ఒకే వేదికపై అన్ని అనుమతులపై చర్చించి అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశారు. గతంలో అనుమతులకు అభ్యంతరం చెప్పినప్పుడు.. ఇప్పుడెలా అనుమతులు సాధ్యమనే చర్చ నడుస్తోంది.

చింతలూరు కొండ

 తగ్గేదేలే..

చింతలూరు సర్వే నెంబరు 1లో సత్యశాంతి సంక్షేమ సేవా సమితి 36.669 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వకాలకు మార్చిలో లీజు పొందింది. తవ్వకాలకు అనువుగా రోడ్లు, ఇతర వనరులు సమకూర్చుకున్నారు. ఈ లీజు కేటాయింపును వ్యతిరేకిస్తూ వైకాపా మద్దతు సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, ఇతర నాయకులు ఆందోళనలు చేశారు. గనుల లీజుల కోసం పంచాయతీ తీర్మానాలు తీసుకోలేదనీ... ప్రత్యేక అధికారాలతోనే వ్యవహారం చక్కబెట్టారని సర్పంచి గంగ, ఎంపీటీసీ సభ్యురాలు షర్మిల.. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంత జరిగినా.. అధికార పక్ష కీలక నేత జోక్యంతో సద్దుమణిగింది. ఈ క్వారీ వెనుక ఓ బడా నాయకుడు ఉండటమే ఇక్కడి పరిస్థితి కుదుటపడడానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల కొత్త అనుమతుల జారీకి పీసీబీ ఆధ్వర్యంలో కాకినాడ జేసీ ఇలక్కియా ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. సర్వే నంబరు 1లోనే 54.48 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వకాలకు హైదరాబాద్‌కు చెందిన మార్లిన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో 40.93 హెక్టార్లలో మూడు లీజులకు, స్వర్ణభారతి ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో 13.55 హెక్టార్లలో ఒక లీజుకు 20 ఏళ్లపాటు తవ్వకాలకు అనుమతించాలని సంబంధిత యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. 2020 నుంచి ఈ లీజులకు ప్రయత్నిస్తుండగా.. అధికారపక్ష ఆశీస్సులతోనే తాజాగా అడ్డంకులు తొలగాయనే వాదన వినిపిస్తోంది.

ఇది మా అడ్డా...

చింతలూరు కొండలు తోటపల్లి అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. సర్వేనంబరు 1లో సుమారు 950 హెక్టార్లలో 720 హెక్టార్లు రక్షిత అటవీ ప్రాంతంలో ఉంటే.. మిగిలింది రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. తాజాగా లీజులు రెవెన్యూ భూమిలో కేటాయించారు. అయిదు లీజుల్లో 91.15 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వకాలు సాగనున్నాయి.. తాజా ప్రజాభిప్రాయం సేకరణ జరిగిన నాలుగు లీజుల మంజూరు లాంఛనమేనని తెలుస్తోంది. క్వారీల్లో లీజులు ఎవరి పేరిట పొందినా తెరవెనుక పెద్దలే చక్రం తిప్పుతుండడంతో అనుమతులు, అభ్యంతరాలతో పనిలేదనే వాదన వినిపిస్తోంది.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వంతాడ, గజ్జనపూడి, గిరిజనాపురం ప్రాంతాల్లో క్వారీ తవ్వకాల చుట్టూ వివాదాలు కొత్తేమీ కాదు. ఇక్కడి కొండల్లో సిమెంటు తయారీకి వాడే లేటరైట్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ తవ్వకాలు, అక్రమాలు, విచారణల వ్యవహారం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీశాయి.

అటవీ అనుమతులు తప్పనిసరి

రక్షిత అటవీ ప్రాంతానికి ఆనుకుని గనుల తవ్వకాలు జరపాలంటే శాఖాపరంగా నిరభ్యంతర పత్రం తప్పనిసరి. చింతలూరులో తవ్వకాల కోసం నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరూ దరఖాస్తు చేయలేదు. అనుమతులు ఇవ్వలేదు. గతంలో అనుమతులు ఇచ్చారా లేదా..? అనే విషయం పరిశీలిస్తాం. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపిన విషయం నాదృష్టికి రాలేదు. దస్త్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

- రాజు, డీఎఫ్‌వో, కాకినాడ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని