logo

అనుమతించామా.. అంతే సంగతులు!

ఆన్‌లైన్‌ నగదు లావాదేవీల విషయాల్లో ఏ చిన్న పొరపాటు చేసినా వాటిని సైబర్‌ నేరగాళ్లు అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నగదు వాలెట్లు, లాటరీలు, స్క్రాచ్‌కార్డులు పేరిట సందేశాలు పంపుతూ బురిడీ కొట్టించి ఖాతాలను ఖాళీ చేసేవారు. ప్రస్తుతం

Published : 30 Sep 2022 02:34 IST

న్యూస్‌టుడే, కంబాలచెరువు, దానవాయిపేట(రాజమహేంద్రవరం)

ఆన్‌లైన్‌ నగదు లావాదేవీల విషయాల్లో ఏ చిన్న పొరపాటు చేసినా వాటిని సైబర్‌ నేరగాళ్లు అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నగదు వాలెట్లు, లాటరీలు, స్క్రాచ్‌కార్డులు పేరిట సందేశాలు పంపుతూ బురిడీ కొట్టించి ఖాతాలను ఖాళీ చేసేవారు. ప్రస్తుతం తాజా పరిణామాలను ఆసరాగా చేసుకుని పండగ రాయితీలు, లాటరీల పేరుతో సందేశాల్లో లింకులను పంపించి మనకు తెలియకుండానే వారి వలలో పడేలా కొత్త మోసాలకు తెరలేపుతున్నారు.

* రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళ చరవాణికి ఈ నెల 20న లాటరీ పేరుతో ఓ సందేశం వచ్చింది. అందులో ఉన్న లింకును పొరపాటున క్లిక్‌ చేసి వివిధ యాక్సెస్‌లకు అనుమతులు ఇవ్వడంతో రెండు రుణ యాప్‌లు ఫోనులో ఇన్‌స్టాల్‌ అయ్యాయి. గంటల వ్యవధిలో ఆమె బ్యాంకు ఖాతాలోకి రూ.4,500 జమైంది. ఈ విషయం ఆమెకు తెలియదు. ఈ నెల 24న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి యాప్‌ ద్వారా తీసుకున్న రుణానికి వడ్డీ సహా మొత్తం రూ.8 వేలు చెల్లించాలన్నాడు. అసలు తాను రుణమే తీసుకోలేదని చెప్పినా ఆమె బ్యాంకు ఖాతా వివరాలు చెప్పి అసలు, వడ్డీ వెంటనే చెల్లించాలని బెదిరించాడు. 25న మళ్లీ ఫోన్‌ చేసి ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తామని వేధింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

* కడియం మండలంలోని దుళ్లకు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌ రుణయాప్‌ ద్వారా లోన్లు తీసుకోవడం.. నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించడం వంటివి ఏడాది నుంచి చేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఓ వ్యాపార ప్రకటనలో లింకు ద్వారా ఫ్యూచర్‌ క్రెడిట్‌ లోన్‌ అనే రుణ యాప్‌ తన ఫోన్లో వచ్చి చేరింది. దాని నుంచి రూ.3,400 రుణం పొందాడు. తర్వాత యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 17న పోలీసులను ఆశ్రయించాడు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే తెలియని లింకులు క్లిక్‌ చేసి అడిగిన దానికల్లా అనుమతులు ఇచ్చామంటే ఇక అంతే సంగతులు. మనకు వద్దన్నా రుణాలిచ్చి వాటిని వడ్డీతో సహా వసూలు చేయడం.. ఇవ్వలేమంటే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వేధించడం.. రుణం తీసుకున్న వ్యక్తి స్నేహితులు, బంధువులకు అసభ్యకరంగా మార్ఫింగ్‌ ఫొటోలు, సందేశాలు పంపి మానసికంగా కుంగిపోయేలా చేస్తూ ఆన్‌లైన్‌ రుణయాప్‌ నిర్వాహకులు రాక్షసానందం పొందుతారు. ఇవన్నీ ఎందుకు అనుకుని డబ్బులు వెంటనే చెల్లించేసినా మళ్లీ ఖాతాలో కొంత మొత్తాన్ని రుణం కింద ఇచ్చి మూడు రెట్లు అధికంగా చెల్లించాలంటూ వేధించడం పరిపాటిగా మారిపోయింది.

ఒక్కసారి క్లిక్‌ చేస్తే అంతే..

రుణయాప్‌ నిర్వాహకులు పంపే లింకు ఒక్కసారి క్లిక్‌ చేస్తే చాలు అంతే సంగతులు. మనకు తెలియకుండానే యాప్‌లు మన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిపోవడం.. దాని నుంచి మనకు తెలియకుండానే రుణం ఖాతాలో పడిపోవడం.. దానంతటవే జరిగిపోతాయి. వారం తరువాత ఆ రుణం వడ్డీతో సహా చెల్లించాలని యాప్‌ నిర్వాహకులు ఫోన్‌ చేస్తేగాని మనకు విషయం తెలియని పరిస్థితి. ప్రస్తుతం దసరా, దీపావళి తదితర పండగలు, డే ఈవెంట్లను ఆసరాగా చేసుకుని వ్యాపార ప్రకటనల రూపంలో సందేశాలు పంపిస్తూ అందులో ప్రమాదకరమైన లింకులు పెడుతున్నారు. దీనిపై అత్యంత అప్రమత్తంగా లేకుంటే మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

*  ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్నారంటే అది వంద శాతం మోసపూరిత యాప్‌గా ప్రజలు గుర్తించాలి.

* ఇవి సాధారణంగా ప్లే స్టోర్‌లో ఉండవు. ఏదైనా లింకులు, గేమ్‌ యాప్‌లను క్లిక్‌ చేయడం ద్వారా ఏపీకే అనే లింక్‌, యాప్‌ ద్వారా మన ఫోన్‌లో మాల్‌వేర్‌ వచ్చి చేరుతుంది. తద్వారా మన ఫోన్‌లోని పూర్తి వివరాలు వారికి వెళ్లిపోతాయి. ఈ యాప్‌ నిర్వాహకులు రూ.5-15 వేల వరకు రుణాలు ఇచ్చి రోజుల వ్యవధిలో బెదిరించి మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తారు.

* మన ఫోన్లలో ఎలాంటి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినా ముందుగా అడిగే యాక్సస్‌లను పరిశీలించి అనుమతి ఇవ్వాలి.

ఇవీ నకిలీ యాప్‌లు..

హ్యాండీలోన్‌, లీ క్యాష్‌, స్పీడ్‌ లోన్‌, క్రెడిట్‌ లోన్‌, క్రెడిట్‌ గురూ, రాయల్‌ క్యాష్‌ డెస్క్‌, డెక్‌ లోన్‌, సాగా పోకెట్‌ లోన్‌ తదితర యాప్‌లు నకిలీ యాప్‌లుగా జిల్లా పోలీసులు గుర్తించారు. వీటికి ప్రజలు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని