logo

అడుగడుగునా ఆదరణ

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు శుక్రవారం ద్వారకాతిరుమల మండలంలో సాదర స్వాగతం లభించింది. దెందులూరు మండలం పెరుగుగూడెంలో ఉదయం 9 గంటలకు యాత్ర మొదలైంది.

Updated : 01 Oct 2022 05:59 IST


ద్వారకాతిరుమల ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్న పాదయాత్ర

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే- ద్వారకాతిరుమల, కామవరపుకోట: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు శుక్రవారం ద్వారకాతిరుమల మండలంలో సాదర స్వాగతం లభించింది. దెందులూరు మండలం పెరుగుగూడెంలో ఉదయం 9 గంటలకు యాత్ర మొదలైంది. పూజా కార్యక్రమాల అనంతరం మెట్టపంగిడిగూడెం వైపు సాగింది. పంగిడిగూడెం చేరుకునే సరికి పరిసర ప్రాంతాల రైతులు, రైతు కూలీలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కొందరు భవనాలపై నుంచి పూల వర్షం కురిపించారు. అమరావతే రాష్ట్రానికి రాజధాని అంటూ నినదించారు. రైతులు భారీగా ట్రాక్టర్లపై యాత్రలో పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల మహిళలు కోలాటం చేస్తూ నినాదాలు చేశారు. యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆయా గ్రామాల ప్రజలు రహదారులకు ఇరువైపులా చేరి పూలతో స్వాగతం పలికారు. రథానికి ముందు నీరు పోసి, కొబ్బరికాయలు కొట్టారు. మహిళా రైతులకు కుంకుమ పెట్టి స్వాగతించారు. గుమ్మడి కాయలతో దిష్టితీసి, హారతులిచ్చారు. తెదేపా, సీపీఎం, సీపీఐ, భాజపా నాయకులు సంఘీభావం ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు తిమ్మాపురంలో భోజన విరామం తీసుకున్నారు. అనంతరం 3  గంటలకు బయలుదేరి ద్వారకాతిరుమల చేరుకున్నారు. ప్రవేశద్వారం వద్ద రైతులు స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఐకాస సభ్యులు ఆలయానికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పూజలు చేశారు.

నేడు యాత్రకు విరామం: ద్వారకాతిరుమలలో శుక్రవారం సాయంత్రం మహాపాదయాత్ర ముగిసిన వెంటనే వైష్టవి ఫంక్షన్‌ హాలుకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. శనివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారం 21వ రోజు పాదయాత్ర మొదలై నల్లజర్ల మండలం చేరనుంది.


రూ.లక్ష విరాళం అందిస్తున్న తెదేపా నాయకులు

రూ.లక్ష విరాళం..
గోపాలపురం: అమరావతి రైతుల చేస్తున్న మహా పాదయాత్రకు గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం, పెద్దాపురం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. తిమ్మాపురంలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు. కొర్లపాటి రాము, యిల్లూరి రాంబాబు, కొయ్య శివరామకృష్ణ, పరిమి జగదీష్‌, కొయ్య రమణ, కొర్లపాటి అన్నవరం, మద్దిపాటి సత్యనాగేంద్ర, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని