logo

పూర్తి వసతులతో 14 వైద్య విభాగాలు

ప్రభుత్వం వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో త్వరలో పూర్తిస్థాయి వసతులతో 14 రకాల వైద్య విభాగాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సర్వజన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాజమహేంద్రవరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ పేర్కొన్నారు.

Published : 01 Oct 2022 05:20 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

ప్రభుత్వం వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో త్వరలో పూర్తిస్థాయి వసతులతో 14 రకాల వైద్య విభాగాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సర్వజన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాజమహేంద్రవరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో రోగులకు అందే సేవలు, వైద్య కళాశాల పనుల ప్రగతి, నిధులు, నియామకాలు తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు  అనుగుణంగా..
జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన భవనాల నిర్మాణాలు, పాత భవనం ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన, పరికరాలు, యంత్రాల ఏర్పాటు, వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బంది నియామకాలు చేపట్టేలా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులకు బోధన, రోగులకు వైద్యం సక్రమంగా అందేలా ఆసుపత్రి నిర్మాణాలు తీర్చిదిద్దుతున్నాం. మౌలిక వసతులు పూర్తయ్యాక డిసెంబర్‌లో ఎన్‌ఎంసీ పరిశీలనకు వెళ్తాం.

వచ్చే ఏడాదికి అందుబాటులోకి..
వచ్చే ఏడాది నీట్‌ ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఎన్‌ఎంసీ రెండు విడతల పరిశీలన పూర్తవుతుంది. వారి తనిఖీల్లో సూచించిన మార్పులను చేపట్టి ఏదేమైనా వచ్చే ఏడాది 150 వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికగా ముందుకెళ్తోంది.

వసతుల పెంపు
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో పాత ప్రధాన భవనం మొత్తాన్ని ఓపీ సేవలకు వినియోగించేలా చూస్తున్నాం. కొత్తగా మల్లికార్జున నగర్‌లో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న భవనాల్లో మొదటి రెండేళ్లు వైద్య కళాశాలగా వినియోగించి మూడేళ్లు పూర్తయ్యేనాటికి పాత ఓపీ భవనానికి కుడి, ఎడమ వైపు శాశ్వత కట్టడాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు ప్రారంభమయ్యాయి. ఇలా ఏడాదికేడాది వసతులు పెంచుకుంటూ ఎన్‌ఎంసీ పరిశీలనలకు వెళ్తూ అయిదేళ్లలో మొదటి బ్యాచ్‌ బయటికొచ్చే సమయానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాం.

నిర్మాణాలు సాగుతున్నాయిలా...
వైద్య కళాశాల, బోధనాసుపత్రికి సంబంధించి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.మల్లికార్జున నగర్‌లో నిర్మాణం పూర్తవుతుంది. ఆసుపత్రి ప్రాంగణంలోని మాతాశిశు విభాగంపైన రెండస్తుల భవనాలు స్లాబు దశ దాటాయి. ఆర్డీ కార్యాలయం వెనక విద్యార్థులు, విద్యార్థినుల వసతి గృహాల పనులు మొదలయ్యాయి. ప్రధాన భవనం మొత్తాన్ని ఆధునికీకరిస్తున్నారు.

దసరా తరువాత పూర్తిస్థాయి బాధ్యతలు
ఏపీ వైద్యవిధాన పరిషత్తు ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆసుపత్రి నడుస్తున్న నేపథ్యంలో దసరా అనంతరం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆసుపత్రి బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపడతాం. ప్రస్తుతం సిబ్బంది, ఆర్థిక లావాదేవీలు, పరికరాలు, భవనాలు, చేయాల్సిన పనులు తదితర అంశాలపై వైద్య విధాన పరిషత్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం.

పదేళ్లకు అత్యున్నతం
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాసుపత్రికి సంబంధించి మొదటి బ్యాచ్‌ బయటికొచ్చాక పీజీ సీట్ల అనుమతులు వస్తాయి. రెండేళ్ల పీజీ విద్యార్థులు కోర్సు పూర్తయి బయటికొచ్చాక సూపర్‌స్పెషాలిటీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇలా రాబోయే పదేళ్లలో నగరం, పరిసర ప్రాంత ప్రజలకు అత్యున్నతమైన సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని