logo

‘పంచాయతీ నిధులు పక్కదారి’

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తూ హక్కులను హరించివేస్తున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 01 Oct 2022 05:20 IST


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విష్ణువర్థన్‌రెడ్డి

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం): వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తూ హక్కులను హరించివేస్తున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వమే దొంగిలిస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ప్రజా పోరుయాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంచాయతీలకు నిధులు అందక పలుచోట్ల సర్పంచులు రాజీనామా చేస్తున్నారన్నారు.  రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకు కూడా ఓటుహక్కు ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ ఏ మాత్రం లేదన్నారు. అప్పు ఇస్తే అంతరిక్షానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. 95 శాతం హామీలు నెరవేర్చామని చెబుతున్న జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు అంగుళం కూడా కదలలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు. ముఖ్యమంత్రితోపాటు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేల ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ భాజపాను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మేధావుల ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా పనిచేసిన ఆయన పుట్టిన ఊరికి ఏం చేశారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని