logo

ఎవరి కోసం సవరణలు?

ఉమ్మడి జిల్లా పరిధిలో వైద్య విద్య, వైద్య విధాన పరిషత్తు, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో పారామెడికల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. 16 విభాగాలకు సంబంధించి 320 ఖాళీల భర్తీకి ఆగస్టు 5న కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Updated : 01 Oct 2022 05:48 IST

పారామెడికల్‌ పోస్టుల భర్తీలో గందరగోళం


అభ్యర్థి ధ్రువపత్రాల పరిశీలన (పాతచిత్రం)

కాకినాడ కలెక్టరేట్‌, మసీదుసెంటర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా పరిధిలో వైద్య విద్య, వైద్య విధాన పరిషత్తు, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో పారామెడికల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. 16 విభాగాలకు సంబంధించి 320 ఖాళీల భర్తీకి ఆగస్టు 5న కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రాథమిక, తుది ఎంపిక జాబితాల విషయంలో పలుమార్లు సవరణలు చోటుచేసుకోవడంపై అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శకాలు పాటించడంలో పర్యవేక్షణ లోపం, అవగాహన రాహిత్యంతో ప్రతి అంశంలోనూ సవరణలు చోటుచేసుకున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిస్టుల నియామకాల విషయంలో నిబంధనలు పాటించలేదని గతంలో కొందరు వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆశ్రయించగా, అక్కడి నుంచి జిల్లా అధికారులకు అక్షింతలు పడ్డాయి. ప్రధానంగా అభ్యర్థుల మార్కుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడి నుంచి మార్గదర్శకాలు రావడంతో ప్రతిభ జాబితాలో మార్పులు చేటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో నిరుద్యోగులు అధికారుల నిర్వాకానికి ఇబ్బంది పడగా.. అక్కడి అధికారులు సరిదిద్దారు. ఒక నోటిఫికేషన్‌కు సంబంధించి అన్ని ప్రక్రియలకూ సవరణలు తీసుకురావడం ఎవరికి మేలు చేయడానికని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబరు 9లోగా అన్ని పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా.. ఇప్పటికీ పూర్తిచేయలేని స్థితిలో అధికారులున్నారు. తాజాగా శుక్రవారం కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి జారీ చేసిన ప్రకటన అభ్యర్థులను మరింత గందరగోళానికి గురి చేసింది. అభ్యర్థుల ఎంపిక తుది జాబితాకు మళ్లీ సవరణలు చేసినట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.

ఎన్నడూ లేదిలా...
ఆగస్టు 5న పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీన్ని సవరిస్తూ.. పోస్టులు తగ్గిస్తూ మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అనంతరం 14 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటి వడబోత ప్రక్రియలోనూ గందరగోళం నెలకొంది. వివిధ శాఖల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి దరఖాస్తుల పరిశీలన చేయించారు. తరువాత ప్రొవిజనల్‌ ప్రతిభ జాబితా ప్రచురించారు. వారం తరువాత మళ్లీ దాన్ని సవరించి రివైజ్డ్‌ జాబితా ప్రచురించారు. తుది ప్రతిభ జాబితా కింద 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిపించి, ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ఇది పూర్తయిన తరువాత ఎంపికైన వారి జాబితా ప్రకటించాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్‌ చేసి వారికి స్థానాలు కేటాయించాలి. అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలు అందించాలి. కానీ ఇవేవీ చేయకుండా మళ్లీ నవీకరించిన ఆఖరి ప్రతిభ జాబితా(రివైజ్డ్‌) పెట్టారు. ఇది పూర్తిగా అభ్యర్థులను గందరగోళానికి గురిచేసింది. ఎన్నడూలేని విధంగా ఇన్ని మజిలీలు ఏంటని అభ్యర్థులు వాపోతున్నారు. నిజమైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఓ ఉద్యోగి కుటుంబ సభ్యుడిని ప్రతిభ జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఉన్నధికారుల ఆదేశాలతోనే..
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తుది ప్రతిభ జాబితాకు సవరణలు చేయాల్సి వచ్చింది. తుది జాబితా ప్రచురించి, 1:2 నిష్పత్తితో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన చేసిన తరువాత కొన్ని క్యాడర్లకు సంబంధించి రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కలెక్టర్‌ అనుమతితో తుది జాబితాను సవరించి ప్రచురించాం. ఇప్పుడు అన్ని అంశాలనూ క్రోడీకరించి తుది జాబితా రూపొందించాం. దీని ప్రకారం త్వరలో కౌన్సెలింగ్‌ నిర్వహించి, అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తాం.

- ఆర్‌.రమేశ్‌ డీఎంహెచ్‌వో, కాకినాడ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని