logo

స్వచ్ఛ మాటలు.. నీటి మూటలు

ద క్షిణ గంగ గోదావరి.. పవిత్ర ప్రాణధార గోదావరి.. ఈ నేలను సస్యశ్యామలం చేసి.. ప్రజల గొంతు తడిపి.. ఇక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులనే మార్చేసిందీ నదీమతల్లి.. మానవ తప్పిదాలు, కీలక శాఖల ఉదాసీనత వెరసి ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

Published : 01 Oct 2022 05:37 IST

ఈనాడు, కాకినాడ -న్యూస్‌టుడే, సామర్లకోట గ్రామీణం


రాజమహేంద్రవరం: నల్లాఛానల్‌ నుంచి గోదావరిలో కలుస్తున్న మురుగు

ద క్షిణ గంగ గోదావరి.. పవిత్ర ప్రాణధార గోదావరి.. ఈ నేలను సస్యశ్యామలం చేసి.. ప్రజల గొంతు తడిపి.. ఇక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులనే మార్చేసిందీ నదీమతల్లి.. మానవ తప్పిదాలు, కీలక శాఖల ఉదాసీనత వెరసి ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. సాగు, తాగు జలాల్లో కాలుష్య తీవ్రత పెరగడంతో.. ఇప్పుడు ప్రక్షాళన కోరుకుంటోంది.. రెండేళ్ల కిందట సర్కారు గోదావరి- కృష్ణా జలాల శుద్ధీకరణ ప్రకటన చేసినా.. కీలకమైన గోదావరి జిల్లాల్లో పరిస్థితి మారలేదు. మరోవైపు కేంద్రం తలపెట్టిన నమామి గోదావరిదీ అదే పరిస్థితి.

* ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన గోదావరి కాలుష్యం కోరల్లో చిక్కింది. రాజమహేంద్రవరంలో రోజువారీ 60 మిలియన్‌ లీటర్ల వ్యర్థాలు విడుదలవుతాయి. ఆవ ప్రాంత ఎస్టీపీలో 30 ఎంఎల్‌డీ జలాలు అరకొరగా శుద్ధిచేసి వదిలి.. మిగిలిందంతా నల్లా, ఆవ ఛానళ్ల ద్వారా నదిలోకి వదిలేస్తున్నారు. దీనికితోడు పరిశ్రమలు, ఇతర వ్యర్థాలు నదిలో కలవడం ఇబ్బందిగా మారింది.
* పి.గన్నవరం ప్రధాన పంట కాలువ.. 55 కి.మీ పరిధి ఆసాంతం వ్యర్థాలమయమే. అమలాపురం, ముక్తేశ్వరం ప్రధాన పంట కాలవలూ ఇంతే. కోనసీమలో 26 రక్షిత నీటి పథకాలకు, సెంట్రల్‌ డెల్టా పరిధిలో 2 లక్షల ఎకరాలకు గోదావరి జలాలే ఆధారం. ఈ నీళ్లు చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇళ్ల నుంచి మరుగుదొడ్ల గొట్టాలు, పరిశ్రమల వ్యర్థాలతో కలుషితం అవుతున్నాయి.

సర్కారు లక్ష్యమిదీ...
‘‘గోదావరి డెల్టా పరిధిలో 10 వేల కి.మీ. కాలువలు ఉన్నాయి. వీటిని కాలుష్య రహితంగా తీర్చిదిద్ది.. సుందరీకరించాలి. శుద్ధి చేసి... స్వచ్ఛమైన తాగు, సాగు జలాలు అందించాలి. కాలువ గట్లు ఆక్రమించకుండా చూస్తూనే.. ఇప్పటికే ఉన్న ఆక్రమణలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపి తొలగించాలి.’’

-ఇదీ ‘మిషన్‌ క్లీన్‌ కృష్ణా- గోదావరి కెనాల్స్‌’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్దేశించుకుందిలా..

క్షేత్రస్థాయి చిత్రమిదీ...
కాకినాడ నగర పరిధిలోని ఇంద్రపాలెం వంతెన నుంచి సామర్లకోట మండలం మాధవపట్నం మార్గంలో జలవనరుల శాఖ పంట కాలువ పూడిక పేరుకుపోయి అధ్వానంగా మారింది. ఖాళీ కొబ్బరి బొండాలు, నిర్మాణ, ఇతర వ్యర్థాలు, మృత కళేబరాలు కాలువలో పడేయటం సమస్యగా మారింది. జలాలు కలుషితమై దోమలు, కీటకాల బెడద ఎక్కువై ప్రజారోగ్యం దెబ్బతింటోంది.

భయపెడుతోంది..
ఉభయ గోదావరి జిల్లాల్లో 3 వేల కి.మీ మేర పంట కాలువలు ప్రవహిస్తున్నా.. ఇవి దయనీయంగా ఉన్నాయి. దోసిళ్లతో నీళ్లు తీసుకుని కడుపారా తాగే పరిస్థితి దశాబ్దాల కిందట ఉంటే.. ఇప్పుడు కాలు పెట్టడానికీ వెనకాడాల్సిందే. ఎక్కడికక్కడ పూడిక పేరుకోగా, వ్యర్థాల పారబోత సమస్యకు కారణం. 2019-20లో తూడు తొలగింపునకు రూ.18.75 కోట్లు మంజూరు చేసినా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నిరుడు కాలువ బాగుకు రూ.కోట్లలో నిధులు వెచ్చించినా కుదుటపడలేదు.

గొంతు తడిపే నీరిదే..
ఉమ్మడి జిల్లాలో గోదావరి ఆధారిత సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు 64 ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలకు ఈ జలాలే ప్రాణధార. ఒక్కో స్కీం పరిధిలో 20 ఆవాస ప్రాంతాలు ఆధారితమయ్యాయి. సెంట్రల్‌ డెల్టా పరిధిలో పి.గన్నవరం కెనాల్‌, అమలాపురం కెనాల్‌, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్‌ పరిధిలో 26 నీటి పథకాలు ఉన్నా.. కాలువల ప్రక్షాళన లేక ప్రజారోగ్యం దెబ్బతింటోంది.


కాకినాడ-సామర్లకోట రోడ్డులో పంట కాలువ పక్కనే ఖాళీ కొబ్బరి బొండాల రాశులు

చెత్తంతా కాలువల్లోనే..
కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూగో జిల్లాల్లో ఎక్కడా సరైన డంపింగ్‌ యార్డులు లేవు. దీంతో చెత్తాచెదారం కాలువల్లో పడేస్తున్నారు. ఈ వ్యర్థాలు కుళ్లి ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. పంట కాలువల ఆధునికీకరణలో తాత్సారంతో జలాల గమనానికి
అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.

అడుగులు పడేనా..?
* ‘నమామి గోదావరి’: పేరుతో నదీ కాలుష్య నివారణకు కేంద్ర జలశక్తి విభాగం రూ.404.40 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. తొలిగా రూ.85 కోట్లు ఇచ్చింది. ఆవ వద్ద మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. రాజమహేంద్రవరంలో ఎగువ ప్రాంతాల్లో వ్యర్థజలాలు నల్ల ఛానల్‌ ద్వారా ఆర్యాపురం వద్ద, దిగువ ప్రాంతాల్లో ఆవ ఛానల్‌ ద్వారా ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద నదిలో కలుస్తున్నాయి. ఈ జలాలే క్లోరినేషన్‌ చేసి తాగక తప్పడంలేదు.
* ‘మిషన్‌ క్లీన్‌ కృష్ణా- గోదావరి కెనాల్స్‌’: మిషన్‌ ద్వారా దశల వారీగా గోదావరి నదీ ప్రక్షాళన చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. అక్టోబరు 2-30 వరకు ఇంద్రపాలెం - మాధవపట్నం మధ్య 3 కి.మీ పంట కాలువ పరిశుభ్రతకు కాకినాడ నగర పాలిక శ్రీకారం చుట్టింది. కాలువ శుభ్రత, పచ్చదనం, నిఘాకు రూ.కోటిపైనే కావాలని అంచనా.

రూ.4.31 కోట్లతో ప్రతిపాదనలు
గోదావరి పరిధిలోని పంట కాలువల ప్రక్షాళన, సుందరీకరణకు రూ.4.31 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈ నిధులు మంజూరైతే 24.72 కి.మీ పొడవున గోదావరి ఈస్ట్రన్‌ డెల్టా ప్రధాన కాలువతోపాటు.. సామర్లకోట, మండపేట, కోరంగి, అమలాపురం కాలువల్లో పూడిక తీత, ఇతర పనులు చేపడతాం.

-కె.నర్సింహమూర్తి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని