logo

కదిలొచ్చిన నారీలోకం

నారీలోకం ఉత్సాహంగా కదిలొచ్చింది.. వివిధ కళారూపాలతో ప్రతిభ ప్రదర్శించింది. గోదావరి తీరాన మహిళాశక్తిని చాటింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం వేదికగా శనివారం జరిగిన ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ ఉత్సాహభరితంగా సాగింది.

Published : 02 Oct 2022 04:20 IST

‘దిశ’ బైక్‌ ర్యాలీలో మంత్రి రోజా, మహిళలు, యువతులు

వి.ఎల్‌.పురం, టి.నగర్, కంబాలచెరువు: నారీలోకం ఉత్సాహంగా కదిలొచ్చింది.. వివిధ కళారూపాలతో ప్రతిభ ప్రదర్శించింది. గోదావరి తీరాన మహిళాశక్తిని చాటింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం వేదికగా శనివారం జరిగిన ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ ఉత్సాహభరితంగా సాగింది. తొలుత ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు నిర్వహించిన ‘దిశ’ బైక్‌ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు. ఎంపీ భరత్‌రామ్‌ ఈ ర్యాలీని ప్రారంభించగా మహిళలతో కలిసి మంత్రి రోజా సభావేదిక వరకు ద్విచక్ర వాహనం నడిపి సందడి చేశారు. అనంతరం సభావేదిక ప్రాంగణంలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తులు, సంప్రదాయ వంటకాలు, పౌష్టికాహారం స్టాల్స్‌ను మంత్రులు రోజా, తానేటి వనిత ప్రారంభించి తిలకించారు. అనంతరం మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ముందుగా యువతులు, బాలికలు.. కోలాటం, కరాటే, కర్రసాము, కత్తిసాము, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో కళాప్రతిభను ప్రదర్శించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రసంగాల అనంతరం లఘుచిత్రాల పోటీల్లో విజేతలకు, ప్రదర్శనలతో అలరించిన వారికి బహుమతులిచ్చారు.

అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం పటిష్ఠ చర్యలు చేపడుతోందని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఉత్సవంలో భాగంగా శనివారం ఉదయం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో మానవ అక్రమ రవాణా నిరోధం, దిశ పోలీసుస్టేషన్లను పటిష్టపరచడం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐడీ(మహిళా సంరక్షణ) ఎస్పీ కేజీవీ సరిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిరోధానికి పోరాడే వ్యక్తులు సామాజిక ధర్మం కోసం పాటుపడుతున్నామనే ఆలోచన, నిబద్ధతతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని దిశ పోలీసులు, సిబ్బందికి సూచించారు. మహిళా కమిషన్‌ సభ్యురాలు జయశ్రీ రాసిన ‘ఆమెకు తోడుగా న్యాయదేవత’ పుస్తకాన్ని సరిత ఆవిష్కరించారు. మహిళా కమిషన్‌ కార్యదర్శి శైలజ, సభ్యులు పాల్గొన్నారు.

‘ఆమె’ లఘుచిత్రానికి ప్రథమ బహుమతి

ఉత్తమ నటీనటులు వీరే..

లఘుచిత్ర ఉత్తమ నటిగా బండారు నాగరాణి (సబల), ఉత్తమ నటుడిగా సూర్య ఆకొండ(ఆమె), ఉత్తమ రచయితగా మల్లికార్జున(నర రాక్షస), ఉత్తమ దర్శకులుగా బాల(దిశది పవర్‌ఆఫ్‌ ఉమెన్‌)లు ఎంపికకాగా వీరికి ఒక్కొక్కరికి రూ.20 వేలు ఇచ్చారు.

లఘుచిత్రాలకు బహుమతులు

‘సబల’ రాష్ట్రస్థాయి లఘుచిత్ర(షార్ట్‌ఫిల్మ్‌) పోటీలకు వివిధ జిల్లాల నుంచి వందకు పైగా లఘుచిత్రాలు రాగా వీటిలో ఎనిమిది ఎంపికయ్యాయి. మొదటి బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు, మిగతా అయిదు లఘు చిత్రాలకు రూ.25 వేలు చొప్పున ఇచ్చారు. ‘ఆమె’ జె.ఎంటర్‌టైన్మెంట్‌(కాకినాడ), ‘సబల’ షారోన్‌ ఫిలింస్‌(గుంటూరు), ‘రాధిక’ మైరా క్రియేటివ్స్‌(రాజమహేంద్రవరం) షార్ట్‌ఫిల్మ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నాయి. ‘నాకు మీరు మీకు నేను’ యూనివర్సల్‌ క్రియేషన్స్‌(రాజమహేంద్రవరం), ‘స్వేచ్ఛ’ డ్రీమ్‌ మేకర్స్‌(గుంటూరు), ‘భవిత’ వంశీమీడియా(చిలకలూరిపేట) ‘మహిళలు మీకు వందనం’ సత్తి రత్నకుమారి ఫిలిమ్స్‌(మాచవరం), ‘సర్వం సబల శక్తిమయం’ ఎంకే ప్రొడక్షన్స్‌ బహుమతులందుకున్నాయి.

సాధికారత ఉత్సవ సంరంభం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని