logo

‘వికేంద్రీకరణ.. వైకాపా ప్రభుత్వ విధానం’

అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని రాష్ట్ర మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందే వైకాపా మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాన్ని చేర్చామని, దాన్నే అమలు చేస్తామని ప్రకటించారు.

Published : 02 Oct 2022 04:20 IST

ప్రసంగిస్తున్న కన్నబాబు, వేదికపై ఎంపీ గీత,

మంత్రులు రాజా, వేణు తదితరులు

కాకినాడ కలెక్టరేట్, వెంకట్‌నగర్, న్యూస్‌టుడే: అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని రాష్ట్ర మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందే వైకాపా మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాన్ని చేర్చామని, దాన్నే అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే మా నినాదమని ఉద్ఘాటించారు. వికేంద్రీకరణపై పెద్ద ఎత్తున ప్రజలకు వివరించాలని, దీనికోసం ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శనివారం కాకినాడలోని డీ-కన్వెన్షన్‌ హాల్లో ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ అధ్యక్షతన కాకినాడ జిల్లాకు సంబంధించి వికేంద్రీకరణపై రౌండు టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వివరించారు. అనంతరం వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు వికేంద్రీకరణపై అభిప్రాయాలు వెల్లడించారు. విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, వైద్యులు, ఆచార్యులు, అధ్యాపకులు, రవాణా, పోర్టు, తదితర రంగాలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు వారి మనోభావాలను వ్యక్తీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వికేంద్రీకరణతో ఒనగూరే ప్రయోజనాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు వివరించాలన్నారు. గ్రామస్థాయి వరకు దీన్ని తీసుకువెళ్లాలన్నారు. నియోజకవర్గ కేంద్రం, పట్టణాల్లో వికేంద్రీకరణ రౌండు టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. 26 జిల్లాల అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యమని, వికేంద్రీకరణతోనే ఇది సాధ్యమన్నారు. వికేంద్రీకరణపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రజలంతా గొంతు కలపాలని పిలుపునిచ్చారు. మళ్లీ రాష్ట్ర విభజన పునరావృతం కాకుండా ఉండాలంటే అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కావాలన్నారు. సంస్కృతి, ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న, కాకినాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

వక్తలు ఏమన్నారంటే..?

* సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మేధావులు మాట్లాడితే ప్రభుత్వానికి లాభమని.. మౌనంగా ఉంటే మేధావులకే నష్టం అన్నారు. వికేంద్రీకరణ ప్రయోజనాలపై చర్చించాలన్నారు. * ఎంపీ బోస్‌ మాట్లాడుతూ తాను ఉద్యమాన్ని తప్పుపట్టననీ.. రాజధాని అమరావతిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న భావన సరికాదన్నారు. * ఎంపీ గీత మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో నష్టం జరిగిందని.. మళ్లీ ఇది పునరావృతం కాకూడదనే ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించిందన్నారు. * ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్‌ వాడ్రేవు రవి, రామకృష్ణ మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని.. పలు దేశాల్లో రాజధానుల తీరును వివరించారు. * విద్యావేత్త చిరంజీవికుమారి మాట్లాడుతూ రాజుల కాలంలో రాజధానులు ఉండేవని.. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందేదని.. ఇప్పుడా ఆ భావన సరికాదన్నారు. * నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలూ అభివృద్ధి చెందాలన్నారు. * విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధి శాస్త్రి మాట్లాడుతూ 90 శాతం మంది పింఛనుదారులు వికేంద్రీకరణ కోరుతున్నారన్నారు. * ఏపీ హోటళ్ల యాజమాన్య సంఘం ప్రతినిధి వెంకటేశ్‌ మాట్లాడుతూ వికేంద్రీకరణతో హోటల్‌ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని