logo

రుణయాప్‌ ఫిర్యాదులకు సీఐడీ కంట్రోల్‌ సెల్‌

రుణయాప్‌ వేధింపులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఫిర్యాదుల కోసం సీఐడీ కంట్రోల్‌ సెల్‌ను ఏర్పాటు చేసి కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ వేగవంతం చేసేలా చర్యలు చేపట్టామని సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన

Published : 03 Oct 2022 05:47 IST

‘న్యూస్‌టుడే’తో సీఐడీ ఎస్పీ సరిత
న్యూస్‌టుడే, కంబాలచెరువు(రాజమహేంద్రవరం)

రుణయాప్‌ వేధింపులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఫిర్యాదుల కోసం సీఐడీ కంట్రోల్‌ సెల్‌ను ఏర్పాటు చేసి కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ వేగవంతం చేసేలా చర్యలు చేపట్టామని సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను ‘న్యూస్‌టుడే’ పలకరించగా రుణయాప్‌లపై నిఘా, మానవ అక్రమ రవాణా కట్టడికి చేపడుతున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే...

అధికారులతో పర్యవేక్షణ

రుణ యాప్‌లకు సంబంధించి ప్రతి ఫిర్యాదును అమరావతిలోని సీఐడీ కంట్రోల్‌ సెల్‌ నుంచి పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగంతోపాటు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో ఎస్పీల ఆధ్వర్యంలో కేసుల విచారణ, దర్యాప్తులను పటిష్టంగా జరిగేలా నిత్యం పర్యవేక్షిస్తాం.

మానవ అక్రమ రవాణా కట్టడికి యూనిట్లు

రాష్ట్రంలో మూడేళ్ల కిందట వరకు మూడు చోట్ల మాత్రమే మానవ అక్రమ రవాణా కట్టడి యూనిట్లు ఉండేవి. వాటిని 2021లో 13 జిల్లాలకు 13 యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఈ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా యూనిట్లలో అధికారులు, సిబ్బంది మానవ అక్రమ రవాణాలో బాధితులను రక్షించి హోంకు పంపడం దగ్గర నుంచి నిందితులకు శిక్ష పడేవరకు చర్యలు చేపడతారు..

ఏడుగురు అధికారులతో సేవలు

జీవో నంబర్‌ 47 ప్రకారం అన్ని జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు ఏర్పాటు చేసి అందులో ఏడుగురు అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. ఒక ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ మహిళా సంరక్షణ విభాగంలో ఉంటారు. జిల్లాల్లో ఉండే ఈ యూనిట్లు మరింత బలోపేతం చేసేలా ఏపీ పోలీసుశాఖ ప్రణాళిక అమలు చేయనుంది.

మహిళా సంరక్షణపై..

సీఐడీ ఆధ్వర్యంలో నడిచే మహిళా సంరక్షణ విభాగాల్లో అధికారులు, సిబ్బందికి ఆయా జిల్లాల్లో ఎస్పీ ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణకు అదనంగా ప్రతి శుక్రవారం ఆన్‌లైన్‌ వేదికగా మూడు వారాల నుంచి శిక్షణ ఇస్తున్నాం. మానవ అక్రమ రవాణాకు సంబంధించి నిందితులను గుర్తించడం.. బాధితురాలితో మాట్లాడి వారి వెనక ఇంతటి ఉచ్చులోకి దింపుతున్న వారి నెట్‌వర్క్‌ను పట్టుకోవడం.. బాధితులను కాపాడే విధానం.. విచారణ.. దర్యాప్తు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. ఇదంతా ఓ ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ పటిష్ట చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నాం.

సాంకేతిక మోసాలపై అప్రమత్తం

ప్రస్తుత సాంకేతికతలో ఎన్నో మోసాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు బయట ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు యువత, చిన్నారులకు వివరించాలి. వారు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిత్యం అవగాహన కల్పించాలి. పోలీసుల్లోనూ పలు అపోహల కారణంగా కేసులను పూర్తిస్థాయి ఛేదనలో వెనుకంజ ఉంది. సాధారణ వ్యక్తుల్లా అపోహలకు లోనుకాకుండా మానవ అక్రమ రవాణాలోని బాధితురాలి సమస్యను క్షేత్రస్థాయిలో తెలుసుకుని దర్యాప్తు చేస్తే అసలు నిందితులకు శిక్ష పడేలా చేయొచ్చు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని