logo

లేనిభూమి కుదువపెట్టి.. రూ.కోట్లు కొల్లగొట్టి

వారంతా ఖరీదైన నర్సరీ భూములున్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడి ఓ సర్వే నంబరును విభజించారు. కొత్త నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి లేనిభూములు ఉన్నట్లు చూపించారు. అనంతరం దళారులతో జతకట్టి, నీకింత నాకింత.. అని వాటాలు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Published : 03 Oct 2022 05:47 IST

ఈనాడు- రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే- కడియం

వారంతా ఖరీదైన నర్సరీ భూములున్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడి ఓ సర్వే నంబరును విభజించారు. కొత్త నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి లేనిభూములు ఉన్నట్లు చూపించారు. అనంతరం దళారులతో జతకట్టి, నీకింత నాకింత.. అని వాటాలు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నర్సరీ సాగుదారులమంటూ ఓ బ్యాంకు బ్రాంచిని ఆశ్రయించి రూ. 9 కోట్ల రుణం తీసుకుని పంచుకున్నారు. తర్వాత రుణం చెల్లించకపోవడంతో ప్రస్తుతం అది అసలు, వడ్డీతో కలిపి సుమారు రూ.17 కోట్లుకు చేరింది. ఇదీ తాజాగా కడియంలో వెలుగుచూసిన మోసం.

పక్కా ప్రణాళికతో..

మాయగాళ్లు సర్వే నంబరు 233/11 ఆధారంగా నకిలీ పత్రాలు తయారుచేసి బ్యాంకును బురిడీ కొట్టించారు. కడియం మండలం కడియపులంక పరిధిలోని ఈ సర్వే నంబరులో 0.92 సెంట్ల భూమి మాత్రమే రెవెన్యూ దస్త్రాల్లో ఉంది. ఈ సర్వే నంబరును 233/11-2 సబ్‌డివిజన్‌గా విభజించారు. అందులో అయిదుగురికి 21.32 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ దస్త్రాలు సృష్టించారు. ఇదే సర్వే నంబరును 233/11-3 సబ్‌డివిజన్‌గా విభజించి ముగ్గురికి పారీకత్తులు (ఒకే కుటుంబంలో వాటాలు) చేసినట్లు చూపారు. దీనికి సంబందించిన డాక్యుమెంట్లను ఎ, బి, సి షెడ్యూళ్లుగా కడియం సబ్‌రిజిస్త్రార్‌ కార్యాలయంలో 2015లో రిజిష్టర్‌ చేయించినట్లు తెలిసింది. కడియం పరిధిలోనే 201/6సి సర్వేనంబరులో 2.10 ఎకరాలు, 233/2-1ఎ సర్వే నంబరులో 5 ఎకరాలు, వీరవరం పరిధిలో 159/1 సర్వే నంబరులో 50 సెంట్లు ఉన్నట్లు పత్రాలు సృష్టించారు. ఈ పత్రాలు ఇప్పటికే కడియం తహసీల్దారు కార్యాలయానికి చేరాయి. వాటిని పూర్తిగా పరిశీలించిన అధికారులు నకిలీవని తేల్చారు. అదనపు సర్వే నంబర్లు సృష్టించి మాయచేసినట్లు గుర్తించారు. కొన్ని సర్వే నంబర్లతో రుణ తహసీల్దార్ల సంతకాలు తేడాగా ఉండటం, డిజిటన్‌ సైన్‌ను కాపీ చేసి జత చేయడం లాంటివి బయటపడ్డాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. తొమ్మిది మందిలో ఒకరివి మినహా మిగిలినవారి పత్రాలు సరిగా లేవని తేల్చారు. ఈ రుణ మాయ వెనుక రెవెన్యూ, రిజిస్ట్రార్‌శాఖల ఉద్యోగులతోపాటు.. లేఖర్లు, బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ కుంభకోణం బయటకు పొక్కినా కీలకశాఖల అధికారులెవ్వరూ నోరుమెదపడం లేదు.

సీఐడీకు అప్పగించే యోచనలో..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గోదాముల్లో సరకు నిల్వల పేరుతో బ్యాంకులను మోసంచేసి రూ.వందల కోట్లు రుణాలు పొందిన కేసులకు ఇప్పటికీ అతీగతీలేదు. రూ.కోట్లలో డిపాజిట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన సంస్థల కేసులదీ అదే పరిస్థితి. ఈ కేసులు ఇప్పుడు సీఐడీ విచారణలో ఉన్నాయి. తాజా ఈ కేసునూ సీఐడీకి అప్పగించాలనే యోచనలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దారు ఇచ్చే నివేదిక ఆధారంగా బ్యాంకు సిబ్బంది సీఐడీని ఆశ్రయించనున్నట్లు సమాచారం. దీనిపై కడియం తహసీల్దార్‌ ఎం.సుజాత మాట్లాడుతూ.. బ్యాంకు అధికారులు అందజేసిన వివరాల ప్రకారం చూస్తే రెవెన్యూ దస్త్రాల్లో ఆ వ్యక్తులకు ఆ సర్వే నంబర్లలో భూములు లేవన్నారు. దీనిపై లోతుగా పరిశీలించి సంబంధిత బ్యాంకు అధికారులకు వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని