logo

ప్రధానోపాధ్యాయులు బడికి రావాల్సిందే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, నిర్మాణ సామగ్రి కొరతతో ‘మనబడి నాడు-నేడు’ రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. . సుమారు 45 రోజుల నుంచి చాలా పాఠశాలలకు ఇసుక సరఫరా కాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. సిమెంటు సరఫరా అంతంత మాత్రమే.

Published : 03 Oct 2022 05:47 IST

న్యూస్‌టుడే, పామర్రు


ఇసుక కొరతతో పనులు మొదలు కాని కోటిపల్లి ఉన్నత పాఠశాల

మ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, నిర్మాణ సామగ్రి కొరతతో ‘మనబడి నాడు-నేడు’ రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. . సుమారు 45 రోజుల నుంచి చాలా పాఠశాలలకు ఇసుక సరఫరా కాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. సిమెంటు సరఫరా అంతంత మాత్రమే. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంటు నుంచి రావాల్సిన విద్యుద్ధీకరణ, శానిటరీ సామగ్రి ఊసే లేదు.  ఎంఈవో, సీఆర్పీలను అడిగితే ఇదిగో.. అదిగో వచ్చేస్తాయనే సమాధానమే వస్తోంది. దీనివల్ల పనులు సాగకున్నా దసరా సెలవుల్లోనూ బడులకు హాజరు కావాల్సిందేనని, నాడు-నేడు పథకంలో జరుగుతున్న పనులు, సరఫరా అవుతున్న సామగ్రిని సరిచూసుకోవాల్సిందేనని ఇటీవల విద్యాశాఖ నుంచి ఆదేశాలు రావడంపట్ల ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 2,614 పాఠశాలల్లో నాడు-నేడు రెండోదశ పనులు చేపట్టడానికి రూ.805 కోట్లు మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికి రూ.133 కోట్లు విడుదలై ఆయా పాఠశాలల యాజమాన్య సంఘాల ఖాతాల్లో జమయ్యాయి. ఇవికాక మొదటి దశలో చేపట్టిన పాఠశాలల్లో 3,859 అదనపు తరగతి గదులు నిర్మాణానికి ప్రతిపాదనలు చేయగా.. వాటి నుంచి 1,164 రద్దు చేశారు. మిగిలిన 2,695 గదులను నిర్మాణానికి రూ.323.40 కోట్లతో పనులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు.

పనుల్లో జాప్యానికి కారణాలు పరిశీలిస్తే..

రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదల కావడంలోని ఆలస్యం, కీలకమైన ఇసుక రాకపోవడం, సిమెంటు సరఫరా లేకపోవడం.. అందుబాటులో ఉన్న నిధులు, సామగ్రితో పనులు చేసేసినా తదుపరి నిధులు రాకపోవడం తదితరాలు కనిపిస్తున్నాయి. కె.గంగవరం మండలం సత్యవాడ, కుందూరు, కోటిపల్లి తదితర ఉన్నత పాఠశాలలకు రూ.63 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా వచ్చింది. పనులు మొదలు పెడదామని 30 టన్నుల ఇసుక అవసరమని సంబంధిత ఇంజినీరింగ్‌ సహాయకులతో యాప్‌లో ఇండెంటు కూడా పెట్టారు. సుమారు 45 రోజులు దాటిపోతున్నా నేటికీ సరఫరా చేయలేదు. ఇసుక అందుబాటులో లేక విద్యుద్ధీకరణ పనులు మొదలు పెట్టామని, వాటికి సంబంధించిన గొట్టాలు, వైర్లు కూడా పంపిస్తామని చెప్పినా.. ఇంకా రాలేదని సత్యవాడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అన్నారు. ఇసుక బయట కొనుగోలు చేసుకుందామనుకున్నా అధిక ధర చెబుతున్నారన్నారు. ఇసుక కొద్దిపాటి వచ్చిన చోట పనులు మొదలు పెట్టారు. అవి పునాది దశలోనే ఉన్నాయి. ఇప్పటికే ఇసుక, సామగ్రి కానీ వచ్చి ఉంటే 60 నుంచి 70 శాతం పనులు పూర్తయి ఉండేవని వారంటున్నారు. ఇసుక, సిమెంటు, సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంటు నుంచి రావాల్సిన శానిటరీ, విద్యుద్దీకరణ సామగ్రి పూర్తి స్థాయిలో వస్తే రెండు నెలల్లో పనులు పూర్తి చేయవచ్చని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

ముఖాధారిత హాజరు తప్పని సరి

దసరా సెలవుల్లో పాఠశాలకు హాజరైన ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. యథావిధిగా వచ్చినప్పుడు, వెళ్లేటపుడు కూడా హాజరు వేయాలని సూచించారు. దీనిని బట్టి విధిగా ఎవరో ఒకరు బడిలో ఉండి తీరాలని చెప్పకనే చెబుతున్నట్లువుతోంది.


వరదలు, వర్షాల వల్లే ఇసుక  కొరత
- ఎన్‌.రవిసాగర్‌, డీఈవో, కోనసీమ

గోదావరి నదికి వరుసగా నాలుగు సార్లు వరదలు వచ్చాయి. దాంతో రీచ్‌ల్లోంచి ఇసుక తీసుకు రావడానికి వీలు కుదరలేదని గుత్తేదారులు చెప్పారు. వారి వద్ద ఉన్న నిల్వల నుంచి వరుసగా పంపిస్తున్నారు.  నాడు-నేడు పనులకు ఆటంకం లేకుండా అవసరం అయిన తగినంత ఇసుక, సిమెంటును స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని కూడా సూచిస్తున్నాం.  పనులు జరిగేటపుడు, నాణ్యత పరిశీలించుకోవడానికి, ఇండెంటు పెట్టిన ప్రకారం సంబంధిత సామగ్రి వచ్చిందో లేదో చూసుకునేందుకు మాత్రమే దసరా సెలవుల్లో హెచ్‌ఎం కానీ, బాధ్యుడు ఎవరో ఒకరు కానీ రావాలని ఉన్నతాధికారులు చెప్పారు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని