logo

తొలిపొద్దు మెరవగ.. తూరుపు మురవగ!

ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పాన్ని.. పాదయాత్ర ద్వారా మోసుకొస్తున్న రాజధాని రైతులకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అద్వితీయంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం, హారతులతో నీరాజనాలు పలికారు. రైతులు చేపట్టిన మహా పాదయాత్ర

Published : 03 Oct 2022 06:08 IST

ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే - గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరుమల

ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పాన్ని.. పాదయాత్ర ద్వారా మోసుకొస్తున్న రాజధాని రైతులకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అద్వితీయంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం, హారతులతో నీరాజనాలు పలికారు. రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఆదివారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మొదలై రాళ్లకుంట వరకు సాగింది. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో అడుగుపెట్టడంతో తొలిగా తూర్పున ప్రభవించింది. జిల్లాలో పాదయాత్ర జరిగిన అయ్యవరం, కొత్తగూడెం, గాంధీకాలనీ, దూబచర్ల ఇలా ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు రైతులను ఆత్మీయంగా ఆహ్వానించారు. మహిళలు భారీగా పాల్గొని రైతులతో కలిసి జై అమరావతి అని నినదించారు. రైతు రథానికి ముందు నీరుపోసి.. కొబ్బరికాయలు కొట్టారు. మహిళా రైతులకు కుంకుమ పెట్టి స్వాగతించారు. గుమ్మడి కాయలతో దిష్టితీసి, హారతులిచ్చి సాగనంపారు. యాత్రకు చేయూతగా విరాళాలిచ్చారు.

నీరాజనం: మహాపాదయాత్రకు సంఘీభావ వెల్లువ

బ్రహ్మరథం

ద్వారకాతిరుమల కూడలిలో భారీగా జనం రావటంతో తీన్మార్‌ వాయిద్యాలతో కోలాహలం నెలకొంది. గోపాలపురం తెదేపా ఇన్‌ఛార్జి ముప్పిడి వెంకటేశ్వరరావు.. డప్పు కొట్టి, బాణం ఎక్కుపెట్టి యాత్రలో హుషారు తీసుకువచ్చారు. ద్వారకాతిరుమల, అయ్యవరంలో ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు రైతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాముడు, హనుమంతుడు, జాంబవంతుడు తదితర వేషధారణలతో కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రతి గ్రామంలో రైతులకు... స్థానికులు బిస్కెట్లు, మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు, తాగునీరు సీసాలు, అల్పాహారం పంపిణీ చేశారు. తెదేపా, జనసేన, సీపీఎం, సీపీఐ, భాజపా, కాంగ్రెస్‌ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు సంఘీభావం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అయ్యవరంలో భోజన విరామం తీసుకున్నారు. అనంతరం కొత్తగూడెం, గాంధీ కాలనీ మీదుగా దూబచర్ల చేరుకోగా యాత్ర ముగిసింది.


నేడు యాత్ర సాగేదిలా..

సోమవారం ఉదయం 9 గంటలకు దూబచర్లలో 22వ రోజు యాత్ర మొదలవుతుంది. అక్కడ నుంచి పుల్లలపాడు-నల్లజర్ల-ప్రకాశరావుపాలెం వరకు నల్లజర్ల మండలంలో సాగుతుంది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో యాత్ర ముగుస్తుంది. 14కిమీ మేర పాదయాత్ర సాగనుంది. నల్లజర్లలో భోజన విరామం తీసుకుంటారు. సోమవారం రాత్రి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు.


విరాళం

దేవరపల్లి: మహా పాదయాత్రకు దేవరపల్లిలోని తెదేపా శ్రేణులు రూ.లక్షన్నర విరాళం అందజేశాయి. దేవరపల్లి గ్రామ తెదేపా తరఫున మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్మన్‌ బాపిరాజు ద్వారా ఐకాస వారికి అయ్యవరంలో అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు