logo

ఇకపై తరగతిగది ఆధారిత మూల్యాంకనం

ఒకటి నుంచి ఎనిమిది తరగతులు చదువుతున్న వారికి ఇప్పటి వరకూ జరుగుతున్న నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక(ఎఫ్‌ఏ, ఎస్‌ఏ) పరీక్షలు రద్దు కానున్నాయి.

Updated : 05 Oct 2022 06:32 IST

న్యూస్‌టుడే, పామర్రు, మండపేట

తరగతి గదిలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ఒకటి నుంచి ఎనిమిది తరగతులు చదువుతున్న వారికి ఇప్పటి వరకూ జరుగుతున్న నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక(ఎఫ్‌ఏ, ఎస్‌ఏ) పరీక్షలు రద్దు కానున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతి గది ఆధారిత మూల్యాంకనం (క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంటు-సీఆర్‌బీఏ) జరపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించి అందుకు అనుగుణంగా సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  9, 10 తరగతులకు పాత పద్ధతిలోనే పరీక్షలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 2 నుంచి 5వ తేదీ వరకూ ఈ మూల్యాంకనం జరుగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇదీ లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన లోపాలు గుర్తించడం, పక్కా బోధనతో వారిలోని సామర్థ్యాలను వెలికితీయడం ప్రధాన లక్ష్యం. ఉత్తమ విద్యా ప్రమాణాలను పెంచడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.
అమలు ఇలా..
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో సీఆర్‌బీఏ జరుగుతుంది. ఈ పరీక్షల్లోని ప్రశ్నలకు జవాబులు ఓఎంఆర్‌ విధానంలో పత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యాసంవత్సరానికి మూడు సార్లు సీబీఏ పరీక్షలు పెడతారు. పరీక్షా పత్రం రూపకల్పన, మూల్యాంకనం కోసం ఇఐ(ఎడ్యుకేషన్‌ ఇనిషియేటివ్స్‌)తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. 1 నుంచి 8వ తరగతి వరకూ ద్విభాషా పద్ధతిలో ప్రశ్నలిస్తారు. విద్యార్థులందరి వ్యక్తిగత ప్రగతిని ఇఐ సంస్థవారు తెలియచేస్తారు. వాటిని అనుసరించి తరగతి గదిలో ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారు.
ఎఫ్‌ఏ, ఎస్‌ఏ స్థానంలోనే..
ఈ సీఆర్‌బీఏ పరీక్ష ఇప్పటి వరకూ జరుగుతున్న కొన్ని ఎఫ్‌ఏ, ఎస్‌ఏల స్థానంలోనే ఉంటాయి. 1-8 వారికి ఎఫ్‌ఏ 1,3 ఎస్‌ఏ.2కు బదులు మూడు పరీక్షలుంటాయి. ఎఫ్‌ఏ.2,4లు ఎస్‌ఏ.1లు పాత విధానంలోనే జరుపుతారు. 9,10 తరగతి వారికి ఎఫ్‌ఏలు నాలుగు, ఎస్‌ఏలు 2 యధావిథిగా జరుగుతాయి.

ప్రశ్నలు ఈ విధంగా ఇస్తారు..
ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు..బహుళైచ్ఛికం, ఖాళీలు పూరింపుము, చాలా చిన్న జవాబులు రాసే ప్రశ్నలు, చిన్న జవాబులు రాసే ప్రశ్నలుగా ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా విద్యార్థిని సమగ్రంగా అంచనా వేసే విధంగా ఎంయూఏ(మెకానికల్‌, అండర్‌స్టాండింగ్‌, అప్లికేషన్‌) విధానంలో ఉంటాయి. ఎంవోఆర్‌ పత్రాల్లో జవాబులు నింపి పంపాల్సిన అవసరం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని