logo

9 పోయే 6 వచ్చే..

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లా అంతా ఒకతీరు.. కొమరగిరి లేఔట్‌ది మరో తీరు. కాకినాడ నగర నియోజకవర్గానికి సంబంధించి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే-ఔట్‌లో 16,601 మందికి పట్టాలిచ్చారు. ఇప్పటికి ఇక్కడ  0.5 శాతం గృహాలు కూడా పూర్తి చేయలేకపోయారు

Published : 24 Nov 2022 05:54 IST

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లా అంతా ఒకతీరు.. కొమరగిరి లేఔట్‌ది మరో తీరు. కాకినాడ నగర నియోజకవర్గానికి సంబంధించి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే-ఔట్‌లో 16,601 మందికి పట్టాలిచ్చారు. ఇప్పటికి ఇక్కడ  0.5 శాతం గృహాలు కూడా పూర్తి చేయలేకపోయారు. కేవలం రూ.1.80 లక్షల యూనిట్‌ విలువతో ఇళ్లు కట్టుకోలేమని చాలామంది చేతులెత్తేశారు. తరువాత అధికారులు నెల్లూరుకు చెందిన జేఎన్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌ సంస్థను తీసుకువచ్చారు.  రూ.3లక్షలతో 44 గజాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా లబ్ధిదారులతో ఒప్పందం చేయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కింద రూ.1.80 లక్షలు, డ్వాక్రా సభ్యులైన లబ్ధిదారులకు బ్యాంకు నుంచి రూ.35వేలు రుణం ఇప్పిస్తున్నారు. మిగతా రూ.80వేలు లబ్ధిదారులు భరించేలా ఒప్పిస్తున్నారు. ఇలా రూ.3 లక్షలకే 44 గజాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా లబ్ధిదారులతో ఒప్పందం చేయిస్తున్నారు. ఇప్పటికి 7,400 మంది ముందుకు వచ్చారు.

-న్యూస్‌టుడే, కాకినాడ (బాలాజీచెరువు)


ఇదీ ఆకృతులపరిస్థితి

నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకంలో గృహ నిర్మాణాల డిజైన్లు అధికారికగా రూపొందించారు. కొమరగిరి లే-ఔట్‌లో ఒక్కో లబ్ధిదారునికి 51 గజాల స్థలాన్ని ఇచ్చారు. దీనిలో 44 గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. దీని ప్రకారం తొమ్మిది పిల్లర్లతో నిర్మాణం చేసి, శ్లాబు వేయాలి. పది అడుగులతో లోతుతో తొమ్మిది స్తంభాలు వేసేందుకు గోతులు తవ్వాలి. పునాదికి ముందు ప్లింత్‌ బీమ్‌ వేయాలి. వీటికి ఫైల్‌ క్యాప్‌లు బిగించాలి. అనంతరం పునాది పూర్తి చేసి, 9 పిల్లర్లను పైకి వేసి, వాటిపై శ్లాబ్‌ వేయాలి. కానీ జేఎన్‌ఆర్‌ సంస్థ చేపట్టిన నిర్మాణాలకు ఆరు పిల్లర్లపైనే శ్లాబు వేయనున్నారు. ప్లింత్‌బీమ్‌ వరకు మాత్రమే తొమ్మిది పిల్లర్లు తీసుకువస్తున్నారు. ఫైల్‌ క్యాప్‌ వేయడంలేదు. ఇలా చేస్తే భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించలేరని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ లే-ఔట్‌ సముద్ర తీరానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడన్నీ తేలికపాటి నేలలు. ఇన్ని ప్రతికూలతల మధ్య పటిష్ఠంగా గృహ నిర్మాణాలు చేపట్టకపోతే ఎంత వరకు సురక్షితమనే అనుమానాలు వెంటాడుతున్నాయి.

పటిష్ఠంగా చేపట్టేలా పర్యవేక్షణ

కొమరగిరి లే-ఔట్‌లో జేఎన్‌ఆర్‌ సంస్థతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జేఎన్‌ఆర్‌ సంస్థ ద్వారా చేపట్టిన నిర్మాణాలకు 12/9 అంగుళాల పరిమాణంతో పది అడుగుల లోతు నుంచి పిల్లర్లు వేయిస్తున్నాం. ఆరు పిల్లర్లపైనే శ్లాబు వస్తుంది. దీంతో ఏవిధమైన ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో పైన రెండో అంతస్తు నిర్మాణానికి అవకాశం ఉండదు. నివాసయోగ్యంగానే గృహాలను నిర్మిస్తున్నారు. దీనిపై సందేహాలొద్దు. జేఎన్‌ఆర్‌ సంస్థతో గృహ నిర్మాణ సంస్థ ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. లబ్ధిదారులతోనే ఈ సంస్థ ఒప్పందం చేసుకుని, నిర్మాణం చేయించుకుంటున్నారు.
- బి.సుధాకర పట్నాయక్‌, కాకినాడ జిల్లా గృహనిర్మాణ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని