logo

తీరానికి తూట్లు..

తీరప్రాంత వనరులు దెబ్బతినకుండా  వాటి నిర్వహణ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటే ప్రకృతి విపత్తుల నుంచి నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చు.

Updated : 24 Nov 2022 06:20 IST

అంతర్వేదిలో సీఆర్‌జడ్‌ పరిధిలో తవ్వకాలు

రాజోలు, సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: తీరప్రాంత వనరులు దెబ్బతినకుండా  వాటి నిర్వహణ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటే ప్రకృతి విపత్తుల నుంచి నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చు. కానీ తీరాన్ని రక్షించడం మరచి నిబంధనలకు విరుద్ధంగా భక్షించేస్తున్నారు కొందరు స్వార్ధపరులు. దీంతో తీరానికి భారీగా తూట్లు పడి రోజురోజుకు సాగరం పల్లెల మీదకు వచ్చేస్తోంది. తీరం వెంట ఉన్న పచ్చని పొలాలు చౌడుబారి బీడుగా మారుతున్నాయి.

రాజోలు నియోజకవర్గంలో అంతర్వేది నుంచి కరవాక వరకు 30 కి.మీ. మేర తీరం విస్తరించి ఉంది. ఒకప్పుడు సుమారు 15 అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఉండే ఇసుక తిన్నెలు కొన్నేళ్లుగా భక్షించేయడంతో ప్రస్తుతం కనుమరుగయ్యాయి. తీరం వెంబడి ఉన్న సీఆర్‌జడ్‌, సొసైటీ భూముల్లో అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది, మలికిపురం మండలంలోని తూర్పుపాలెం తీరంలో ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. రాత్రి, తెల్లవారుజామున ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. దీంతో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు, అక్రమ చెరువులతో సముద్ర పోటు సమయంలో అంతర్వేది, అంతర్వేదికర, కేశవదాసుపాలెం, చింతలమోరి, శంకరగుప్తం, తూర్పుపాలెం, గ్రామాల్లోకి నీరు చేరుతుంది. కొబ్బరి, సరుగుడు, ఇతర ఉద్యాన పంటలన్నీ ఉప్పునీటికి మాడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.

నోటీసులిచ్చినా..దాడులు చేసినా తగ్గేదేలే..

ఇసుక అక్రమ తవ్వకాలపై పలుమార్లు రెవెన్యూ, మైన్స్‌, పోలీసులు  దాడులు నిర్వహించినా ఇసుకాసురులు తగ్గేదేలే అన్నచందాన తవ్వకాలు చేస్తూనేన్నారు. ఇటీవల మలికిపురం మండలం తూర్పుపాలెం నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  రోజూ 30 నుంచి 40 ట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.మూడువేల వరకు ఆర్జిస్తున్నారు.
జిల్లాలోని అధికారిక, అనధికారిక ఆక్వా చెరువులు తవ్వుతూ రూ.కోట్ల విలువైన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. దీనిపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించగా ఎన్జీటీ ఆదేశాలతో సీఆర్‌జడ్‌ పరిధిలో ఉన్న చెరువులు తొలగించడానికి రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఆక్వా చెరువుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న యజమానులు చెరువులు తొలగించకపోవడమే గాక మరిన్ని చెరువులు తవ్వుతూ ఇసుక రవాణా చేస్తున్నారు. వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి.

అక్రమ తవ్వకాలపై చట్టపరమైన చర్యలు

సముద్రతీర ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారికి జరిమానాలు విధించడం జరగుతుంది. ఇటీవలే పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నాం. ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  
-రామాకుమారి, తహసీల్దార్‌, సఖినేటిపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని