మరిచేదెలా.. మది నిలిచేదెలా!
వేల ఆశీస్సులు.. వందల ఆపన్న హస్తాల అండదండలూ ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. మూడేళ్ల వయసులోనే నూరేళ్లు నిండాయి..
చిన్నారి దర్శిత్ మృతితో విషాదం
అడుగేయలేకున్నా..
అమ్మా అంటాడనే ఆశ..
పరుగిడలేకున్నా..
పక్కనే ఉంటాడనే శ్వాస..
కలిసి ఆడలేకున్నా...
కలుసుంటాడనే కాంక్ష...
కలం కదిలిన వేళ..
కురిసె కరుణధార
మేమున్నామనే భరోసా..
కోలుకుంటాడనే ధ్యాస..
బతుకునివ్వాలనే ఆరాటం
బతికించాలనే పోరాటం
వేడుకోని చేతులు లేవు...
తలవని తలపు లేదు..
కత్తిదూసిన కర్కశ విధి
కలలు చెదిరిన క్షణమిది..
కోరుకున్న మనసులకు
వేడుకున్న తలపులకు
అవిసి ఓడిన పయనం
అలసె ప్రతి నయనం
ఈనాడు - కాకినాడ, న్యూస్‌టుడే - తాళ్లపూడి, మసీదుసెంటర్, సాంబమూర్తినగర్: వేల ఆశీస్సులు.. వందల ఆపన్న హస్తాల అండదండలూ ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. మూడేళ్ల వయసులోనే నూరేళ్లు నిండాయి.. కన్నా.. అని పిలిస్తే బుడిబుడి అడుగులతో.. గలగల నవ్వులతో నడిచొచ్చే ఆ చిన్నారి దర్శిత్.. ఇక రాడని.. లేడని తెలిసిన ఆ కన్నపేగు విలవిల్లాడుతోంది. విద్యుదాఘాతానికి గురై.. 14 రోజులుగా కాకినాడ సామాన్య వైద్యశాలలో మృత్యువుతో పోరాడిన దర్శిత్ శుక్రవారం సాయంత్రం ఊపిరి వదిలాడు.. ప్రమాదంలో రెండు కాళ్లూ తొలగించినా.. ఉలుకూ పలుకూ లేకున్నా.. ఆ శ్వాసలో.. కన్నీటి సుడుల్లో.. అమ్మ- నాన్నల ఊసులే.. కళ్లెదుట బాధాతప్త హృదయంతో అమ్మానాన్నల మనోవేదన కదిలిస్తున్నా.. వారి దగ్గరకు ఒక్క ఉదుటన వెళ్లి హత్తుకోవాలనిపించినా.. అమ్మ ఒడిలో బజ్జోవాలనిపించినా.. శరీరం సహకరించని దయనీయ స్థితి ఆ పసివాడిది.. గుండెలను పిండేసే కష్టాన్నంతా భరించి.. విధి పెట్టిన వింత పరీక్షలో నరకయాతన అనుభవించి తుదిశ్వాస విడిచాడు దర్శిత్... మృత్యువుతో పోరాడి ఓడినా.. ప్రతి మదిలో నువ్వే దర్శిత్.. అని ఈ విషాద వార్త తెలిసివారంతా అయ్యో అంటూ నిట్టూరుస్తున్నారు.
మూడేళ్లకే వీడిన బంధం..
తల్లిదండ్రులతో...
దర్శిత్ తండ్రి జొన్నకూటి వినోద్ లారీ డ్రైవర్.. తల్లి చాందిని గృహిణి.. ఇద్దరు పిల్లలు పెద్దబ్బాయి అక్షిత్.. చిన్నోడు దర్శిత్.. యూకేజీ చదువుతున్న అన్నయ్య బడికి వెళ్తే.. ఇంకా లోకం తెలియని మూడేళ్ల దర్శిత్ అమ్మ కొంగు పట్టుకుని వెంటే తిరిగేవాడు.. తల్లి దుస్తులు ఆరేయడానికి మేడపైకి వెళ్లి పనుల్లో నిమగ్నమైతే.. ఏమరపాటులో ఉన్న క్షణంలో... మృత్యువు ప్రమాదం రూపంలో కబళించడానికి నిప్పులు కక్కుతూ దర్శిత్ మీదికి దూకింది.. అంతే.. తీవ్ర విద్యుదాఘాతానికి గురై కాలిన గాయాలతో కుప్పకూలాడా చిన్నారి.. రక్తప్రసరణ నిలిచిపోయి.. కాలిన గాయాల కారణంగా రెండు కాళ్లూ తొలగించినా.. ఆ చిట్టిగుండె అమ్మ ఒడికి చేరాలని.. నాన్న చిటికెన వేలు పట్టుకుని నడవాలని ఆరాట పడింది.. పసిప్రాణం మృత్యువుతో అలుపెరగని పోరాటమే చేసింది.. విధి ముందు దర్శిత్ పట్టువిడవక తప్పలేదు.. శరీరంలో ఇన్‌ఫెక్షన్ పాకుతుంటే.. మరికొంత భాగం తొలగించాల్సి రావడం.. చిన్నిగుండె గమనం తప్పడం.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి లాలన ఆస్వాదించకుండానే ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది.
కన్నయ్య కోసం కన్నీటిధారలు..
కంటికి కునుకులేదు.. కడుపు నిండా తిండి లేదు.. కాకినాడలోని జీజీహెచ్‌లో దర్శిత్‌కు చికిత్స అందిస్తున్న వార్డు దగ్గరే తల్లిదండ్రుల పడిగాపులు.. పేదరికం వెంటాడుతున్న ఈ కుటుంబానికి ‘ఈనాడు’ పిలుపుతో దాతలు భరోసా ఇచ్చినా.. రూ.లక్షల్లో ఆర్థిక ఊతం అందించినా ఆ చిట్టి ప్రాణం మాత్రం నిలవక పోవడం ఆ కుటుంబాన్ని, బంధు గణాన్ని, హితులనూ శోకసంద్రంలో ముంచేసింది.
శ్రమించినా.. నిలవని ప్రాణం..
తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చేరిన మూడేళ్ల దర్శిత్‌కు సుదీర్ఘంగా వైద్య సేవలు అందించినా ప్రాణం నిలవలేదు. దశల వారీగా వైద్యనిపుణులు దర్శిత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించినా ఫలితం లేకపోయింది. ఈనెల 12న దర్శిత్ ఆసుపత్రిలో చేరితే.. అప్పట్నుంచే వైద్య సేవలు అందించారు. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం.. శరీరంలో మృత కణాలు పెరిగి చర్మం కుళ్లిపోయే పరిస్థితి (గాంగ్రిన్) ఏర్పడింది. దీంతో ఈనెల 16న బాలుడికి శస్త్ర చికిత్స చేసిన వైద్యుల బృందం రెండు కాళ్లూ తొలగించింది. రెండు మూడు రోజులు వైద్యానికి శరీరం సహకరించినా.. తర్వాత క్రమంలో కాలిన చర్మం కారణంగా ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడం.. తీవ్రంగా రక్తం వృథా కావడంతో నాలుగుసార్లు రక్తం ఎక్కించినా ఫలితం లేకపోయింది. గురువారం సాయంత్రానికి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడం.. కీలకమైన గుండె, ఊపిరితిత్తులకూ చేరడంతో పరిస్థితి విషమించింది.. దీంతో గురువారం సాయంత్రం నుంచి కృత్రిమ శ్వాసతో వైద్యం అందించాల్సిన పరిస్థితి ఎదురైంది. శరీరంలో కుళ్లిన మరికొంత భాగాన్ని తొలగించడంతో బీపీ డౌన్ అవ్వడం.. పెరగడానికి మందులు ఇచ్చినా.. హై యాంటీ బయాటిక్స్ ఇచ్చి వైద్యం అందించినా పరిస్థితి కుదుట పడలేదు. శరీరాన్ని ఆవహించిన ఇన్‌ఫెక్షన్ తొలగిస్తే ప్రాణాపాయం తప్పుతుందని భావించిన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శుక్రవారం సాయంత్రం దర్శిత్ తుది శ్వాస విడిచాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’
-
General News
Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
-
India News
Raghav Chadha: రాఘవ్ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్.. ఎంపీ సమాధానమిదే..!