logo

18 మెట్రిక్‌ టన్నుల చౌక బియ్యం పట్టివేత

తెలంగాణలోని ఖమ్మం నుంచి కాకినాడ జిల్లాలోని పెద్దాపురానికి సరైన బిల్లులు లేకుండా వ్యాన్‌పై తరలిస్తున్న 18.840 మెట్రిక్‌ టన్నుల చౌక బియ్యం.

Published : 26 Nov 2022 04:23 IST

బియ్యం, నిందితులతో విజిలెన్సు అధికారులు, పోలీసులు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తెలంగాణలోని ఖమ్మం నుంచి కాకినాడ జిల్లాలోని పెద్దాపురానికి సరైన బిల్లులు లేకుండా వ్యాన్‌పై తరలిస్తున్న 18.840 మెట్రిక్‌ టన్నుల చౌక బియ్యం, ఆ వాహనాన్ని రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాతేరు గామన్‌ వంతెన వద్ద స్వాధీనం చేసుకున్నామని విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు ఎస్పీ రవికుమార్‌ చెప్పారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని బి.ప్రత్తిపాడుకు చెందిన మునుగుల శ్రీనివాస్‌ ఈ బియ్యాన్ని పెద్దాపురానికి రవాణా చేయిస్తున్నట్లు గుర్తించామన్నారు. సరైన బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు రెవెన్యూ, పౌరసరఫరా, విజిలెన్సు అధికారులు కలిసి వ్యాన్‌తోపాటు బియ్యాన్ని సీజ్‌ చేసి 6-ఏ కేసు నమోదు చేశామని చెప్పారు. దాంతోపాటు వ్యాన్‌ యజమాని పిఠాపురానికి చెందిన ఆకుల వీరబాబు, గొల్లప్రోలుకు చెందిన డ్రైవర్‌ గంటా సుభాష్‌, బి.ప్రత్తిపాడుకు చెందిన డ్రైవర్‌ సహాయకుడు వూట మణికంఠపై కేసు నమోదుకు రాజమహేంద్రవరంలోని మూడోపట్టణ పోలీసుస్టేషన్‌కు సిఫార్సు చేశామన్నారు. డ్రైవర్‌, సహాయకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చౌక బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. ఎవరైనా చౌక బియ్యం కొనడం, అమ్మడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, తహసీల్దార్‌ విజయ కుమార్‌, సిబ్బంది వలీ, వీరబాబు, రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని