logo

రబీ రైతులకు... 2,65,081 ఎకరాలకు సాగు నీరు

కోనసీమ వ్యాప్తంగా 2,65,081 ఎకరాల ఆయకట్టు రబీ సాగుకు ఈ నెల 30న కాలువలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు జిల్లా సాగునీటి పారుదల సలహామండలి సమావేశంలో నిర్ణయించారు.

Published : 26 Nov 2022 04:23 IST

జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

అమలాపురం(అల్లవరం), న్యూస్‌టుడే: కోనసీమ వ్యాప్తంగా 2,65,081 ఎకరాల ఆయకట్టు రబీ సాగుకు ఈ నెల 30న కాలువలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు జిల్లా సాగునీటి పారుదల సలహామండలి సమావేశంలో నిర్ణయించారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం పలు అంశాలపై ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా సిస్టం పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా నికర ఆయకట్టు 8,96,507 ఎకరాలు ఉండగా.. దీనిలో కోనసీమవ్యాప్తంగా నిర్దేశిత ఆయకట్టుకు కాలువల ద్వారా సాగునీరందించే చర్యలపై చర్చ జరిగింది. పేరవరం, వసంతవాడ, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి విడుదలకు నిధుల మంజూరు తదితరాలపై చర్చించారు.

సమృద్ధిగా నీటి నిల్వలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 8,96,507 ఎకరాల ఆయకట్టుకు 87 టీఎంసీ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజల తాగునీటి అవసరాలకు 7.220 టీఎంసీల నీరు అవసరమని గుర్తించామని జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. దీనిలో గోదావరి నుంచి ఇన్‌ఫ్లో 45.270, సీలేరు నుంచి 40.235, పోలవరం ప్రాజెక్టులో నిల్వఉన్న 16 టీఎంసీలతో కలిపి మొత్తం 101.505 టీఎంసీలు ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు. ఈ ఏడాది ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు.

అలంకారప్రాయంగా చింతలమోరి ఎత్తిపోతలు..

మలికిపురం మండలం శంకరగుప్తంలో నిర్మించిన చింతలమోరి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సుమారు రూ.30 కోట్ల అంచనాలు రూపొందించి.. రూ.18 కోట్ల మేర ఖర్చుచేశారని, ఆ నిధులెందుకూ పనికిరాకుండా పోయాయని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. పథకం ప్రారంభ దశలో చింతలమోరి గ్రామం వద్దనుంచి సాగునీరు పంపింగ్‌ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా శంకరగుప్తం డ్రెయిన్ల నుంచి నీరు పంపింగ్‌ చేయడం వల్ల ఉప్పునీరు వస్తోందని, దాంతో ఈ ప్రాంతంలో పొలాలు, పంట భూములు పాడైపోతున్నాయన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ అధికారులు రెండురోజుల్లో పథకాన్ని పరిశీలించి నివేదిక అందించాలన్నారు. ః పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రతి ఎకరాకూ సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంట కాలువలు డ్రెయిన్ల కన్నా అధ్వానంగా ఉన్నాయని, ఆ నీటినే శుద్ధిచేసి ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారన్నారు. లస్కర్లకు కొన్నాళ్లుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు.

అసంపూర్తిగా నిర్వహణ పనులు..

పంట కాలువలు, డ్రెయిన్లలో నిర్వహిస్తున్న పనులు అసంపూర్తిగా, గత ఖరీఫ్‌ నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అన్నారు. సాధారణ నిర్వహణ పనులుకూడా పూర్తిచేయడం లేదన్నారు. ఖరీఫ్‌లో కోనసీమవ్యాప్తంగా 44 వేల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని, రబీలో ఆ పరిస్థితి రాకుండా చూడాలన్నారు.

గ్రామాలవారీ పర్యవేక్షణ

సాగునీటి సరఫరాను గ్రామాల వారీ కమిటీలు పర్యవేక్షిస్తాయని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. ఉచ్చిలి ఎత్తిపోతలు శిథిలస్థితికి చేరిందని, మరమ్మతులకు రూ.13.50 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు తెలిపారు. వసంతవాడ పథకం ద్వారా 2 వేల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు. పేరవరం పథకం మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరుకు తీర్మానించారు. 63 నిర్వహణ పనులు పూర్తి చేస్తామన్నారు. సీఎస్‌ఆర్‌ నిధుల పనులు నామినేషన్‌ పద్ధతిలో చేయాలన్నారు. లస్కర్ల వేతనాల వివరాలివ్వాలని ఆదేశించారు. ఆర్డీవోలు వసంతరాయుడు, సింధు సుబ్రహ్మణ్యం, ఎస్‌ఈ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు