logo

వదిలేసారా.. వందనం

మద్యం ధరలు పెరిగిపోవడం తదితర కారణాలతో పేదలు సారాకు అలవాటుపడిపోతున్నారు.

Published : 26 Nov 2022 04:23 IST

అంబాజీపేటలో పట్టుకున్న బెల్లం ఊట (పాతచిత్రం)

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం: మద్యం ధరలు పెరిగిపోవడం తదితర కారణాలతో పేదలు సారాకు అలవాటుపడిపోతున్నారు. జిల్లాలో మూడేళ్లుగా సారా అమ్మకం అధికం కావడంతో అదే స్థాయిలో తయారీదారులు, అమ్మకందారులు పెరిగిపోయారు. సారా తాగుతున్నవారిలో ఎక్కువ మంది అనారోగ్యాలపాలు కావడమేకాకుండా ప్రమాదాల బారిన, మృత్యవాతపడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. దాంతో అధికారులు ఉక్కుపాదం మోపుతూ.. సారా రక్కసికి అడ్డుకట్ట వేసేందుకు అవిరళ కృషి సాగిస్తున్నారు. సారా తయారీ, వ్యాపారం వీడినవారికి ప్రత్యామ్నాయ జీవన భృతి, ఉపాధి మార్గాలు కల్పించే దిశగా నడిపిస్తున్నారు.
జిల్లాలో 22 మండలాల్లోని ఏడు ఎస్‌ఈబీ పోలీసుస్టేషన్ల పరిధిలో 74 గ్రామాల్లో సారా విక్రయాలు సాగుతున్నట్లు గుర్తించారు. వారిని ఎన్నిసార్లు అరెస్టు చేసినా.. ఆ వృత్తి విడనాడకపోవడంతో అధికారులు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ పీడీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. వారి అర్హతల ఆధారంగా సారా వ్యాపారం వీడిన 64 మందిని గుర్తించి, వారిలో 29 మందికి ప్రత్యామ్నాయ జీవన భృతి, పునరావాస చర్యల్లో భాగంగా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా రూ.21.20 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి చొరవతో పరివర్తన కార్యక్రమంలో ముందడుగు వేశారు. నాటుసారా వ్యాపారంలో ఉన్నవారు బయటకు రావాలని, మానకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిణి కె.లతామాధురి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి పలు చర్యలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా కలెక్టరేట్‌లో 29 మందికి ఇతర వ్యాపారాలు చేసుకునేలా నగదు చెక్కులు అందజేశారు. ఆ మొత్తాలతో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని