logo

కడసారి వీడ్కోలు కన్నా..

తాళ్లపూడి, మసీదు సెంటర్‌, సాంబమూర్తినగర్‌: గోరుముద్దలు తింటూ కొంగుపట్టుకు తిరిగే ఆ చిన్నారి విగతజీవిలా రావడంతో కన్నతల్లి గుండె పగిలింది.

Published : 27 Nov 2022 04:24 IST

పైడిమెట్టలో అంతిమ యాత్ర

తాళ్లపూడి, మసీదు సెంటర్‌, సాంబమూర్తినగర్‌: గోరుముద్దలు తింటూ కొంగుపట్టుకు తిరిగే ఆ చిన్నారి విగతజీవిలా రావడంతో కన్నతల్లి గుండె పగిలింది. ముద్దులొలికే బిడ్డ పలుకులు వినరావని తండ్రి మనసు చెదిరింది. బుజ్జాయి బుడిబుడి అడుగుల సవ్వడితో నిత్యం సందడిగా ఉండే ఆ ఇల్లు నిశ్శబ్దంగా మారింది. చిరునవ్వుల మోమును తలచి.. ప్రతి మది కన్నీరుమున్నీరు అయింది. చిన్నారి దర్శిత్‌కు తుది వీడ్కోలు పలికేందుకు పైడిమెట్ట కదిలొచ్చింది. కాకినాడ జీజీహెచ్‌ నుంచి శనివారం మధ్యాహ్నం దర్శిత్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తేగా.. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్ర సాగింది. ‘గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్తు తీగల తొలగింపు.. ఇప్పుడు డబ్బులెవరు కట్టారు.. లైను మార్చాలంటే ఫీజు చెల్లించాల్సిందే అన్న అధికార గణం.. మృతికి బాధ్యులెవరు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా’.. అని ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దర్శిత్‌ అమర్‌ రహే అని పలువురు నినాదాలు చేశారు. కన్నీటి నివాళుల మధ్య వీడ్కోలు పలికారు.

జీజీహెచ్‌లో పోస్టుమార్టం

చిన్నారి దర్శిత్‌ మృతదేహానికి శనివారం ఉదయం జీజీహెచ్‌ మార్చురీ వద్ద వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి... అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టానికి ముందు పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసి.. శవపంచనామా పూర్తిచేశారు. మార్చురీ ఆవరణలో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దర్శిత్‌ను తలచుకుంటూ కన్నీరుమున్నీరవగా.. ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.

కాకినాడలో కన్నీరుమున్నీరవుతున్న బాలుడి తల్లి, కుటుంబసభ్యులు

న్యాయం చేయాలని బైఠాయింపు...

33 కేవీ విద్యుత్తు తీగలను తమ ఇంటి పైనుంచి తొలగించాలని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా తొలగించలేదనీ... విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొందనీ.. వారిపై చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబసభ్యులు వాపోయారు. పోస్టుమార్టం సమయంలో జీజీహెచ్‌ మార్చురీ వద్దకు మహాజన సోషలిస్ట్‌ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్‌ వల్లూరి సత్తిబాబు, ఇతర నాయకులు, బాలుడి కుటుంబంతో కలిసి బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం.. కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలనీ, ఘటనకు కారకులైన విద్యుత్తు అధికారులపై చర్యలు తీసుకోవాలనీ, కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు