logo

విగ్రహానికి గంతలు ఘటనలో ముగ్గురికి రిమాండ్‌

అమలాపురం పట్టణంలో శనివారం జరిగిన పలు ఘటనలపై పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. గడియారస్తంభం కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహం కళ్లకు గంతలు కట్టిన దుశ్చర్యకు సంబంధించి వీడియోల్లో ముగ్గురు యువకులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 28 Nov 2022 06:38 IST

గాంధీజీ విగ్రహం వద్ద నిరసనలో ఆర్యవైశ్య సంఘ నాయకులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం పట్టణంలో శనివారం జరిగిన పలు ఘటనలపై పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. గడియారస్తంభం కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహం కళ్లకు గంతలు కట్టిన దుశ్చర్యకు సంబంధించి వీడియోల్లో ముగ్గురు యువకులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అద్దంకివారిలంక నుంచి అమలాపురం వస్తున్న ఆర్టీసీ బస్సును కొందరు యువకులు వాహనంతో ఢీకొట్టి డ్రైవర్‌ను గాయపరిచిన ఘటనలో వారిపై కేసులు నమోదు చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆర్యవైశ్య సంఘ నాయకులు గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి దళితులను అవమానపరిచారని, సామాజిక మాధ్యమాల్లో తమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. పలువురు యువకులు పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలివచ్చారు. విగ్రహం కేసులో రిమాండ్‌ విధించిన చింతా రమేష్‌, జల్లి విజయ్‌కుమార్‌, కట్రు రాజవర్ధన్‌లకు బెయిల్‌ మంజూరు చేశారు.

గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

భారత రాజ్యాంగ దినోత్సవం వేళ మహాత్మాగాంధీజీ విగ్రహం వద్ద అవమానకర ఘటన బాధాకరమని, దోషులను కఠినంగా శిక్షించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచెర్ల వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం గడియారస్తంభం కూడలిలో జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ కొండలరావుకు వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా మహిళా అధ్యక్ష్యురాలు యెండూరి సీతామహాలక్ష్మి, సీతారామయ్య, వై.నాగేశ్వరరావు, వరదా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని