logo

‘రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం’

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, సామాన్యులకు ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 28 Nov 2022 05:47 IST

మాట్లాడుతున్న ఓబులేసు  

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, సామాన్యులకు ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అఖిలభారత భవన నిర్మాణ కార్మిక సంఘం 7వ జాతీయ మహాసభల్లో  పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ విధానాన్ని తీసుకురావడం వల్ల ఎక్కువ ధరపెట్టి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంలోని పాలకులకు అనుకూలమైనవారు, పార్టీలో ఉంటున్న వారు ఇసుకను కొల్లగొట్టి దళారులకు అవకాశం కల్పిస్తూ అటు సామాన్యులకు ఇటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న రాష్ట్రంలోని 50 లక్షల మంది కార్మికులను తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కార్మికులను చైతన్యం చేయడానికి భవన నిర్మాణ సంక్షేమ చట్టంలో ఏయే సౌకర్యాలు వర్తిస్తాయనే విషయాలు చెప్పడానికి సమావేశాలు ఏర్పాటు చేసి టీ, సమోసాలకే రూ.లక్షలు ఖర్చయ్యాయని లెక్కలు రాశారని, ఇలా దాదాపు రూ.29 వేల కోట్లు అధికారులు అవినీతికి పాల్పడినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించినప్పటికీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ బోర్డును నిర్వీర్యంచేసి 32 వేల క్లెయిమ్‌ పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించి 18 రకాల సౌకర్యాలను కార్మికులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఇటీవల బాబారాందేవ్‌ ఒక సమావేశంలో మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసినందున పతంజలి  ఉత్పత్తులను ఏఐటీయూసీ, భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు బహిష్కరించాలని ఈ మహాసభల్లో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. కేరళలో త్వరలో జరిగే ఏఐటీయూసీ జాతీయ మహాసభల్లోనూ దీనిపై తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని