logo

ఫుట్‌బాల్‌ ఆణిముత్యాలు

నరాలు తెగే ఉత్కంఠ.. క్షణాల్లో ఫలితాలు తారుమారు.. అభిమానులు ఆస్వాదించే ఆట.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండగల్లో ఒకటైన ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలు మొదలయ్యాయి.

Published : 28 Nov 2022 05:47 IST

న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌, వెంకటనగర్‌

రాలు తెగే ఉత్కంఠ.. క్షణాల్లో ఫలితాలు తారుమారు.. అభిమానులు ఆస్వాదించే ఆట.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండగల్లో ఒకటైన ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలు మొదలయ్యాయి. బంతిని మెరుపు వేగంతో తీసుకువెళ్లి గోల్‌ చేసేవాడు హీరో అయితే గోల్‌ని ఆపేవాడే స్టార్‌... ఇలాంటి క్రీడలో మనకంటూ ఆణిముత్యాలూ ఉన్నాయి. జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు వారు కష్టపడి ఎదిగిన క్రమం మిగతా క్రీడాకారులకు ఆదర్శం..


కేరళ క్లబ్‌ తరఫున ఆడుతున్నా..

జ్ఞాపిక అందుకుంటున్న అశ్వినిప్రియ

నేను డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువున్నా. మానాన్న చిన్నరాజు.  అబ్బాయిలు ఆడే ఆట మనం ఎందుకు ఆడ   కూడదు అనుకున్నా.. ఈ ఆటలో నేనెందుకు రాణించలేనన్న కాంక్షతో 2016 నుంచి ఫుట్‌బాల్‌ ఆడటం ప్రారంభించా.  పురుషులతో సమానంగా నన్ను కూడా మ్యాచ్‌లో ఆడించారు. దీంతో త్వరగానే పట్టు సాధించగలిగా. రాజమహేంద్రవరంలోని మ్యాజిక్‌బస్‌ అనే సంస్థ నాలోని ప్రతిభను  గుర్తించింది. జర్మనీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున ఆడే అవకాశం వచ్చినప్పుడు ఆ సంస్థ  ఆర్థికంగా సహకారం అందించింది. అక్కడ నుంచి నేను వెనుదిరిగి చూడలేదు. వరుసగా అండర్‌-14, 17, 19తోపాటు సీనియర్స్‌ విభాగాల్లో రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొన్నా. ప్రస్తుతం కేరళ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున ఒక సంవత్సరం నుంచి ఆడుతున్నా.

- అశ్విని ప్రియ


ఆడపిల్లకి ఈ ఆటెందుకు అన్నారు

నేను ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మా అమ్మ సుజాత ఒకప్పుడు అథ్లెట్‌..మైదానంలో పరుగులు పెట్టేది. అప్పట్లో ఆమెను ప్రోత్సహించకపోవటంతో నన్ను క్రీడల్లో ప్రోత్సహించింది.  మైదానంలో ఫుట్‌బాల్‌ ఆడేందుకు వచ్చిన నన్ను మొదట్లో చాలామంది ఆడపిల్లలు ఫుట్‌బాల్‌ ఆడతావా..ఇది మగవాళ్లు ఆడే క్రీడ.. నువ్వు రాణించలేవంటూ హేళన చేసేవారు. ఇంటికొచ్చి అమ్మకు నా బాధను మొరపెట్టుకున్నా. అలా ఏం కాదు.. నువ్వు గెలిపించి చూపించినపుడు వీరెవ్వరూ నిన్ను హేళన చేయరన్నారు. దీంతో రోజూ ఉదయాన్నే స్నేహితులతో సైకిల్‌ తొక్కుకుంటూ మైదానానికి వెళ్లి సాధన చేశా. అండర్‌-14, 17 విభాగాల్లో జాతీయస్థాయి వరకు వెళ్లా. ఇటీవల అసోసియేషన్‌ నిర్వహించిన సీనియర్స్‌ కేటగిరిలోనూ రాష్ట్రస్థాయి పోటీలకు,  అండర్‌-19 స్కూలుగేమ్స్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా. జాతీయజట్టులో చోటు సంపాదించటమే లక్ష్యంగా నిత్యం సాధన చేస్తున్నా. కాకినాడలోని స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ క్లబ్‌ తరఫున రెండేళ్లుగా ఆడుతున్నా.

- సాయిమంజన


ఐపీఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం

ఫుట్‌బాల్‌ అంటే  చాలా ఇష్టం. ఏ మాత్రం అశ్రద్ధగా ఆడినా సెకన్లలో ఆట స్వరూపమే మారిపోతుంది. పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా. అమ్మ రాజేశ్వరి గృహిణి. నాన్న సాయిబాబు రోజుకూలీ. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. అక్కలిద్దరూ క్రీడాకారులే. మాది శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి. చదువు నిమిత్తం కాకినాడ వచ్చా. నాకంటూ ఏదొక ప్రత్యేకత ఉండాలని ఫుట్‌బాల్‌ను ఎంచుకున్నా. శిక్షకులు కూడా ప్రోత్సహించారు. ఇంటర్‌లో ఉండగా ఫుట్‌బాల్‌, లెగ్‌బాల్‌ (సపక్‌తక్రా) రెండూ నేర్చుకున్నా. సపక్‌తక్రాలో రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం సాధించా. ఛత్తీస్‌గడ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణిగా పేరొచ్చింది. రాష్ట్ర అండర్‌-19 బెస్ట్‌ గోల్‌కీపర్‌గా పేరు రావడంతో మరింత పట్టుదల పెరిగింది. ఐపీఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం

- చిలుకు దీపిక


గోల్‌కీపర్‌గా రాణించా...

స్పెయిన్‌కు చెందిన గోల్‌కీపర్‌ ఐకర్‌ క్యాజిలెస్‌ అంటే  చాలా ఇష్టం. పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. అమ్మ వెంకటలక్ష్మి గృహిణి, నాన్న పితాని దామోదర వెంకటసత్యనారాయణ స్పెక్ట్రమ్‌ పవర్‌ ప్లాంట్‌లో పనిచేస్తారు. 8వ తరగతిలో స్నేహితులు ఆడుతున్నప్పుడు చూడటానికి వెళ్లేవాడిని. ఆ సమయంలోనే నాకు ఆసక్తి కలిగింది.  ఫుట్‌బాల్‌లో గోల్‌కీపర్‌గా రాణించా.  2018లో జాతీయ స్థాయి బీసీ రాయ్‌ ట్రోఫీలో రాష్ట్ర జట్టు తరపున గోల్‌కీపర్‌గా మొదటిసారి పాల్గొన్నా. ఆ క్షణాలు ఎప్పటికీ మరువలేను. తర్వాత జాతీయ స్థాయిలో నిర్వహించిన అండర్‌-19 స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో, 2021లో బెంగళూరులో నిర్వహించిన సంతోష్‌ ట్రోఫీలో రాష్ట్ర జట్టు తరఫున గోల్‌కీపర్‌గా ఆడా.

- పితాని సాయిసంపత్‌రాజు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని