logo

పర్యాటకం.. ప్రగతి.. తీరం

అటవీశాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు అడుగులు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అందుకు అవకాశాలున్న ప్రాంతాలకోసం అధికారులు కొంతకాలంగా అన్వేషణ సాగిస్తున్నారు.

Updated : 28 Nov 2022 06:41 IST

ఓడలరేవు తీరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేయనున్న సముద్ర తీర ప్రాంతం

న్యూస్‌టుడే, అమలాపురం(అల్లవరం): అటవీశాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు అడుగులు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అందుకు అవకాశాలున్న ప్రాంతాలకోసం అధికారులు కొంతకాలంగా అన్వేషణ సాగిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రగతికి నిర్ణయించి కార్యాచరణ ప్రారంభించారు.


అటవీశాఖ ఆధ్వర్యంలో సౌకర్యాలు

అటవీశాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధిచేసి మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తీర ప్రాంతాల్లో అల్లవరం మండలం ఓడలరేవు పరిధిలో ఉన్న సముద్ర తీరం, కాట్రేనికోన మండలం కందికుప్ప లైట్‌హౌస్‌ వద్ద 10 హెక్టార్ల విస్తీర్ణంలో  కమ్యూనిటీ బేసిడ్‌ ఎకో టూరిజం పేరుతో అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రూ.కోటితో అంచనాలు సిద్ధం అవుతున్నాయి.


జిల్లాలో 94 కి.మీ.పరిధిలో సాగర సంగమం

అనగానే ప్రతి ఒక్కరి మది పులకిస్తుంది. సముద్ర అలలపై తేలియాడుతూ ఇసుక తిన్నెలపై సేదదీరేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతారు. కోనసీమవ్యాప్తంగా సుమారు 94 కి.మీ. పొడవైన తీర ప్రాంతం ఉంది. జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు కాలాలతో సంబంధం లేకుండా ఇక్కడికి వస్తుంటారు. దాంతో సముద్ర తీరం వెంట సందర్శకుల తాకిడి ఉన్న ప్రదేశాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు.


అభివృద్ధికి ప్రాంతాల గుర్తింపు

కోనసీమ ప్రాంతం పొడవునా సముద్ర తీరానికి వచ్చే సందర్శకులకు ఎక్కడా కనీస వసతులు కనిపించని పరిస్థితి. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో తీర ప్రాంతాల్లో అనువైన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అధికారుల బృందం రెండు సంవత్సరాల క్రితం కోనసీమవ్యాప్తంగా పర్యటించి కొన్ని ప్రాంతాలను గుర్తించి రూ.5 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అంచనాలుసైతం రూపొందించింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు.


పూర్తిస్థాయి మౌలిక వసతులు..

ఓడలరేవు సముద్ర తీరంలో రూ.30లక్షలు, కందికుప్ప లైట్‌హౌస్‌ వద్ద రూ.60 లక్షలతో సందర్శకులు సేదదీరేందుకు కావాల్సిన వసతులు కల్పించనున్నారు. ఓడలరేవు సముద్ర తీరం వెంట ఉన్న అటవీశాఖకు చెందిన భూమిలో బెంచీలు, మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు, క్యాంటీన్‌, చెట్ల పెంపకం, చిన్నారులకు ఆట బొమ్మలతో ఉద్యానం, మడ అడవుల సందర్శనకు ఏర్పాట్లు, పూరి పాకలు వంటివి ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్తు ద్వారా వీటికి అదనపు హంగులు సమకూర్చనున్నారు.

* కందికుప్ప లైట్‌హౌస్‌ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అటవీశాఖ అతిథి గృహం, లైట్‌హౌస్‌, మర్రి చెట్లున్న 10 హెక్టార్ల విస్తీర్ణాన్ని తీర్చిదిద్దనున్నారు.

కాట్రేనికోన మండలం కందికుప్ప లైట్‌ హౌస్‌


స్థానికంగా ఉపాధి అవకాశాలు..

ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలకు సందర్శకులు వస్తుండడంతో స్థానికులకు ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు పర్యాటకపరంగా మరింత ఆకర్షణీయంగా మారితే సందర్శకులు అధికంగా వస్తారు. దాంతో స్థానికులకూ ఉపాధి అవకాశాలేర్పడతాయి.


అవకాశాలను పరిశీలిస్తున్నాం

- ఎం.వి.ప్రసాదరావు, జిల్లా అటవీశాఖ అధికారి

ఎకో టూరిజం పేరుతో ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఓడలరేవు, కందికుప్ప ప్రాంతాలను ఎంపిక చేసి రూ.కోటితో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వస్తు సామగ్రి సమకూర్చేందుకు అంచనాలు రూపొందించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని