logo

ధర పతనం..

కార్తికమాసం ముగిసి మూడు, నాలుగు రోజులు గడిచిందో లేదో కొబ్బరి, అరటి ధరలపై తీవ్ర ప్రభావం పడింది. పండుగలు, పర్వదినాలు, శ్రావణ, కార్తికమాసాల్లో డిమాండ్‌ బట్టి ధర బాగున్నా ఆ తర్వాత మాత్రం వెలవెలబోతోంది.

Published : 28 Nov 2022 05:47 IST

తాడిపర్రులో కొబ్బరి ఒలుపు పనులు

ఉండ్రాజవరం: కార్తికమాసం ముగిసి మూడు, నాలుగు రోజులు గడిచిందో లేదో కొబ్బరి, అరటి ధరలపై తీవ్ర ప్రభావం పడింది. పండుగలు, పర్వదినాలు, శ్రావణ, కార్తికమాసాల్లో డిమాండ్‌ బట్టి ధర బాగున్నా ఆ తర్వాత మాత్రం వెలవెలబోతోంది. కొబ్బరి ధర రూ.12 నుంచి రూ.5కు పడిపోగా, అరటి గెల ధర రూ.250 నుంచి రూ.100కు పతనమైంది. చేసేది లేక రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. జిల్లాలో సుమారు ఆరువేల ఎకరాల్లో కొబ్బరి, మూడువేల ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు.


తగ్గిన అరటి ఎగుమతులు..

నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల నుంచి ఒడిశా, బీహార్‌, మధ్యప్రదేశ్‌, కటక్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు. జిల్లా నుంచి రోజుకు 25 లారీల అరటి (25వేల అరటి గెలలు) ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం ఎగుమతులు మందగించాయి. ఓ చెట్టు పెంచడానికి రూ.190 ఖర్చు అవుతుండగా, గెలకు రూ.100 వస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు.


కొబ్బరిదీ అదే కథ..

ప్రస్తుతం కొబ్బరి కాపు సరిగా లేకపోవటంతో ఎకరానికి 300 కాయలు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతులు కరెంటు బిల్లు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు. పాలకొల్లు, అంబాజీపేట తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇటీవల కేరళ, బెంగళూరుకు వెళ్లారు. అక్కడ అనుకూలంగా ఉండటంతో పెట్టుబడులు పెట్టారు. నిడదవోలు, పాలకొల్లు తదితర ప్రాంతాల నుంచి ఇటీవల సుమారు 800 మంది కొబ్బరి ఒలుపు కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.


కాయలు తీయలేని పరిస్థితి..

- సల్లా కాశీ, కొబ్బరి రైతు, తాడిపర్రు

అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం ధర, దిగుబడి లేదు. సాధారణంగా 40 రోజులకు ఒకసారి కాయలు తీస్తుంటాం. ఇప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి లేదు. దింపు కార్మికులకు కూలీ చెల్లించలేకున్నాం. వాతావరణ మార్పులు, దోమ ఆశించడం కూడా ఓ కారణమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.  


వడ్డీలు చెల్లించలేకున్నాం..

-తోట శ్రీనివాసు, అరటి రైతు, వెలగదుర్రు

వర్షాకాలంలో అరటి తోటలు ధ్వంసం అయ్యాయి. సుమారు మూడులక్షల అరటి చెట్లు నేలకూలాయి. దాని పిలకలు తయారై ప్రస్తుతం గెలలు కోతకు వచ్చాయి. ధర పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఎకరానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టగా వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని