logo

నీదే తప్పు.. ‘కాదు నీదే!’

నా భార్య ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతోంది.. అందువల్లే మా ఇద్దరి మధ్య గొడవలు అంటూ ఓ భర్త ఫిర్యాదు..! మా ఆయన రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడండీ.. ఇక నేను భరించలేను అంటూ భార్య ఆవేదన..!

Updated : 28 Nov 2022 06:37 IST

భార్యభర్తలకు కౌన్సెలింగ్‌

న్యూస్‌టుడే, కాకినాడ (వెంకట్‌నగర్‌): నా భార్య ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతోంది.. అందువల్లే మా ఇద్దరి మధ్య గొడవలు అంటూ ఓ భర్త ఫిర్యాదు..! మా ఆయన రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడండీ.. ఇక నేను భరించలేను అంటూ భార్య ఆవేదన..! ఇలాంటి కారణాలతో గొడవలు పడుతూ.. కొంతమంది భార్యాభర్తలు విడిపోతున్నారు. వీరిలో యువజంటలు కూడా ఉంటున్నాయి. ఈ తరహా కేసులు రోజుకు ఒకట్రెండు కాకినాడలోని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని గృహ హింస నివారణ విభాగానికి వస్తున్నాయి. ఇలా వస్తున్న కేసుల్లో 30 శాతం వరకు న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నాయి.


* గృహహింస నివారణ విభాగాన్ని ఆశ్రయిస్తున్న భార్యాభర్తలు చెబుతున్న సమస్యల్లో కొన్ని చిన్నవి కూడా ఉంటున్నాయని, అవి సర్దుకుపోదగ్గవని కౌన్సెలర్లు, సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.


ఇవీ కారణాలు..

* వస్తున్న ఆదాయానికి కుటుంబ ఖర్చులు.. ఇంటిలో వారి ఖర్చుల మధ్య పొంతన కుదరక గొడవలు అవుతున్నాయి.

* భాగస్వాముల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం లేక అహంకారాలకు పోయి గొడవలు పడుతున్నారు.

* మద్యం మత్తుకు బానిస కావడం.. కొన్ని కుటుంబాల్లో వివాహేతర సంబంధాలకు హేతువుగా మారుతోంది.

* యువతీ యువకుల ఇష్టా ఇష్టాలు తెలుసుకోకుండా తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయడంతో చాలామంది గొడవలు పడుతున్నారు.

* ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థిక సమస్యల కారణంగా కొందరు విడిపోతున్నారు.

* ఉమ్మడి కుటుంబంలో జీవించేందుకు కొంతమంది మహిళలు సుముఖత చూపడం లేదు.అత్తమామలు, ఆడపడుచుల దెప్పిపొడుపులుంటాయని చెబుతున్నారు.


చిన్న సమస్యలతో..

- సీహెచ్‌.తులసి, సోషల్‌ కౌన్సెలర్‌

సంసారంలో చిన్న సమస్యలు సాధారణమే. నేటి యువతీ యువకులు వాటిని అధిగమించడంలో విఫలమవుతున్నారు. దీంతో కుటుంబంలో కలహాలు ఏర్పడి విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. మార్పు వస్తోంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం.


కొన్ని నెలలకే..

- కొండా ప్రవీణ, ఐసీడీఎస్‌ పీడీ

చాలామంది వివాహం చేసుకున్న కొన్ని నెలలకే గొడవలు పడి విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు ఉన్నప్పటికీ కొందరు విడిపోతామంటున్నారు. వారు చెప్పే వాటిలో చాలా వరకు సర్దుకుపోదగ్గ సమస్యలే ఉంటున్నాయి. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ... సర్దుకుపోతే సంసారాలు చక్కబడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని