logo

యముండ..ఇళ్లపై తీగలుండా

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

Published : 29 Nov 2022 04:46 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లపై నుంచి కరెంటు తీగలు వెళ్లడం, స్తంభాలు ఒరిగిపోవడం, కండెక్టర్లు దెబ్బతినడం, తీగలు సాగిపోయి కిందకు వేలాడే పరిస్థితిలో ఉంటూ ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. 15 రోజులుగా తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, కాకినాడ, జగ్గంపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలో 33కేవీ, 11 కేవీ ఫీడర్లు, ఎల్‌టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల భౌతిక పరిస్థితిపై సర్వే నిర్వహించింది. ఇప్పటికి 75 శాతం పూర్తయిన సర్వేలో క్షేత్రంలో దారుణమైన పరిస్థితులున్నట్లు గుర్తించారు. అయిదేళ్లలో 114 మంది వివిధ విద్యుత్తు ప్రమాదాలతో మృత్యువాత పడ్డారు.


దినదిన గండంగా..

బొమ్మూరు మురళీకొండ ప్రాంతంలో చేతికి అందేంత ఎత్తులో ఇళ్ల మధ్య నుంచి వెళ్లిన విద్యుత్తు లైన్లు

ధవళేశ్వరం: బొమ్మూరు మురళీకొండ ప్రాంతంలో 132 కేవీ, 220 కేవీ విద్యుత్తు లైన్లు తక్కువ ఎత్తులో నివాస ప్రాంతాల మధ్య నుంచి వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హైటెన్షన్‌ విద్యుత్తు లైను కింద ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ బొమ్మూరు పంచాయతీ అధికారులు ఇళ్ల నిర్మాణానికి అనుమతుల జారీచేశారు.


సరిదిద్దేందుకు చర్యలు

ఉమ్మడి జిల్లా పరిధిలో విద్యుత్తు వ్యవస్థ భౌతిక పరిస్థితిపై సర్వే మొదలుపెట్టాం. గుర్తించిన లోపాలు సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం.నూరుశాతం సర్వే పూర్తి చేసి, నివేదిక ఇస్తాం. దీని ప్రకారం నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఎక్కడైనా ప్రమాదకరంగా తీగలు, విద్యుత్తు వ్యవస్థ ఉన్నా.. సమీపంలో అధికారులు, సిబ్బందికి సమాచారం అందించాలి.   - టీవీఎస్‌ఎన్‌ మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, తూర్పువిద్యుత్తు పంపిణీ సంస్థ, రాజమహేంద్రవరం సర్కిల్‌


33 కేవీతో భయం భయం

కొవ్వూరు పట్టణం: కొవ్వూరు పరిధిలో 33 కేవీ హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. పశివేదల రోడ్డులోని జగనన్న లేఅవుట్‌ వద్ద గ్రామీణ ప్రాంతానికి కేటాయించిన స్థలం మీదుగా ఈ లైను వెళుతోంది. సత్యవతినగర్‌లోని బ్యాడ్మింటన్‌ స్టేడియం పక్కగా ఉన్న ఓ వీధి పొడవునా 33 కేవీ లైను ఉంది. అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని చెబుతున్నా.. ఇళ్లు కట్టారని విద్యుత్తు శాఖ నుంచి ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు.


సర్వేలో గుర్తించిన లోపాలు

* 33కేవీ ఫీడర్లు 156 ఉండగా, ఇప్పటికి 115 పరిశీలించి,
ఈ లోపాలు గుర్తించారు.
* ఒరిగిన స్తంభాలు 359 పాడైనవి 363 తీగలు కిందకు వేలాడే స్థితిలో ఉన్న పోల్స్‌ 441 పాడైన కండెక్టర్లు 85
* మొత్తం 966 11కేవీ ఫీడర్లలో 453 తనిఖీ చేశారు. వాటి పరిధిలో ఒరిగిన స్తంభాలు 3,015 పాడైనవి 5,152 తీగలు సాగిపోయినవి 4,419 దెబ్బతిన్న కండెక్టర్లు 4,553
* 17,995 కి.మీ మేర ఎల్‌టీ లైన్లుడగా, ఇప్పటికి 1,265 కి.మీ. సర్వే పూర్తి చేశారు. వీటి పరిధిలో స్తంభాలు ఒరిగినవి 2,250 పాడైనవి 6,170 తీగలు కిందకు ఉన్నవి 4,675 పనిచేయని కండెక్టర్లు 6,067
* 76,414 ట్రాన్స్‌ఫార్మర్లకు 3,524 పరిశీలించారు. ఇది కేవలం 6 శాతమే సర్వే పూర్తయింది. ఇప్పటికి పూర్తి చేసిన తనిఖీల్లో ఫ్యూజులు సరిగా లేకపోవడం, భద్రత కల్పించే బాక్స్‌లు పాడైపోవడం వంటి లోపాలున్నాయి.

* ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన బాలుడు దర్శిత్‌ విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
* తాజాగా ఆదివారం అదే జిల్లాలో మరో రైతు విద్యుత్తు ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని