logo

విజ్ఞాన వెలుగు రేఖలు

నన్నయ భారతి.. అదో విజ్ఞాన నిలయం. ఎటు చూసినా వివిధ పురాతన గ్రంథాలు, అరుదైన పుస్తకాలు దర్శనమిస్తాయి.

Updated : 29 Nov 2022 05:11 IST

నన్నయ భారతిలో విద్యార్థులు, స్కాలర్లు

న్యూస్‌టుడే, రాజానగరం: నన్నయ భారతి.. అదో విజ్ఞాన నిలయం. ఎటు చూసినా వివిధ పురాతన గ్రంథాలు, అరుదైన పుస్తకాలు దర్శనమిస్తాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రముఖ ఆలయాలు, వ్యక్తుల రంగుల చిత్ర పటాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. వర్సిటీ కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటైన ఇందులో తాజాగా తాళపత్ర గ్రంథాలు, తామ్ర శాసనాలు వచ్చి చేరాయి.

అరుదైన శాసనాలు..

నన్నయ భారతిలో తాజాగా ఆరు, ఏడు శతాబ్దాల నాటి తామ్ర శాసనాలు, 13, 14 శతాబ్దాల నాటి గోన బుద్దారెడ్డి రచనలైన రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం చేరాయి. 1885లో ముద్రితమైన గ్రంథాలు ఉన్నాయి. శిథిల స్థితికి చేరిన గ్రంథాలు, వివిధ దేశాలకు చెందిన నాణేలు ప్రదర్శనకు ఉంచారు. తాళపత్రాలపై రాసే ఘటం సైతం ఇక్కడ ఉంది.

30 బీరువాలు.. 13వేల గ్రంథాలు

నన్నయ భారతి కేవలం దాతలు సమకూర్చిన పుస్తకాలతో విలసిల్లుతోంది. ప్రస్తుతం 30 బీరువాల్లో 13 వేల గ్రంథాలు ఉన్నాయి. ఇందులో దాదాపు తొమ్మిది వేల పుస్తకాలు తెలుగు సాహిత్యానికి సంబంధించినవే కావడం గమనార్హం. తెలుగు పరిశోధకులకు, సాహితీవేత్తలకు వేదికగా నిలుస్తోంది. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి సుమారు రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌, సంస్కృతం, ఎంబీఏ, ఎంసీఏ, భౌతిక శాస్త్రం, గణితం, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, జియాలజీ, తెలుగు జర్నల్స్‌ ఉన్నాయి.


అందరికీ అందుబాటులో..

బయటి విద్యార్థులు సైతం నన్నయ భారతికి వచ్చి పుస్తకాలు చదువుకోవచ్చు. భవిష్యత్తులో మరింత ఉపయుక్తంగా తీర్చి దిద్దుతాం.

ఆచార్య ఎం.జగన్నాథరావు. వీసీ


విలువైన పుస్తకాలకు నిలయం

2011 నుంచి చేసిన కృషి పలితంగా ఇన్ని పుస్తకాలను దాతలు బహూకరించారు. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
డా.తలారి వాసు, తెలుగు విభాగ సహాయ ఆచార్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని