logo

మా భూమి ఆక్రమించారు.. న్యాయం చేయండి

తన భూమిని అన్యాక్రాంతం చేశారని.. సర్వే చేయించి మా భూమిని మాకు అప్పగించాలని కాకినాడ జిల్లా కాజులూరు మండలం, కుయ్యేరుకు చెందిన నందికోళ్ల సత్యవేణి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో అధికారుల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Published : 29 Nov 2022 04:46 IST

మహిళను బయటకు తీసుకెళ్తున్న పోలీసులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తన భూమిని అన్యాక్రాంతం చేశారని.. సర్వే చేయించి మా భూమిని మాకు అప్పగించాలని కాకినాడ జిల్లా కాజులూరు మండలం, కుయ్యేరుకు చెందిన నందికోళ్ల సత్యవేణి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో అధికారుల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కుయ్యేరు సర్వే నంబరు 135-5లో తన భర్తకు రెండు ఎకరాల భూమి ఉందని, రెవెన్యూ అధికారులు మాత్రం 14 సెంట్ల భూమికే పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారని, మిగతా భూమిని కొందరు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు జిల్లాస్థాయి స్పందనకు వచ్చి ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేవని.. న్యాయం చేసేంత వరకు కదిలేదేని పేర్కొంటూ గుండెలదేరా రోదించారు. కాజులూరు తహసీల్దారును కలిసినా న్యాయం చేయడంలేదని వాపోయారు. ఆన్‌లైన్‌లో దస్త్రాలు తారుమారు చేశారని, విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అక్కడున్న మహిళా ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆమెతో మాట్లాడి.. ఇక్కడ నిరసన తెలపొద్దని, బయటకు వెళ్లిపోవాలని గద్దించారు. ఆమె నిరసన కొనసాగించడంతో బలవంతంగా బయటకు తీసుకెళ్లగా.. అయ్యా.. అమ్మా.. న్యాయం చేయండంటూ ఆమె వేడుకున్నారు. ఈ అంశంపై కాజులూరు తహసీల్దార్‌ బి.సాయిసత్యనారాయణను వివరణ కోరగా.. జిల్లా స్థాయి ‘స్పందన’ నుంచి తమకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు వచ్చిందని, వెంటనే రెవెన్యూ సిబ్బందిని ఆమె వద్దకు పంపించి భూమికి సంబంధించిన ఆధారాలుంటే స్థానిక సచివాయలంలో అందజేయాలని సూచించామన్నారు. ఇప్పటి వరకు ఆమె ఎటువంటి ఆధారాలూ చూపించలేదని, ఇప్పుడైనా ఆ పత్రాలు సచివాలయంలో అందజేస్తే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని