సా..గుతున్న విచారణలు
సహకార బ్యాంకుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగింది.. విచారణలు త్వరితగతిన పూర్తిచేసి అక్రమార్కులపై, వారికి సహకరించినవారిపై చర్యలు తీసుకుని..
సహకార బ్యాంకుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగింది.. విచారణలు త్వరితగతిన పూర్తిచేసి అక్రమార్కులపై, వారికి సహకరించినవారిపై చర్యలు తీసుకుని.. డీసీసీబీని ప్రక్షాళన చేస్తామని ఛైర్మన్, సీఈవోలు చేసిన ప్రకటనలు నీటిమాటలుగానే మిగిలిపోతున్నారు. విచారణలపేరిట ఏళ్ల తరబడి కాలక్షేపం చేస్తున్నారే తప్ప బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఆ శాఖ అధికారుల నుంచే వినిపిస్తున్నాయి. జిల్లాలో కొంతకాలంగా నెలకొన్న పరిస్థితిని ఓ దఫా పరిశీలిస్తే..
న్యూస్‌టుడే, గాంధీనగర్ (కాకినాడ)
నివేదికలు ఏమయ్యాయి...
డీసీసీబీ అనుబంధమైన రావులపాలెం శాఖలో మేనేజర్, సొసైటీ సీఈవోలు 2021లో కౌలు రైతుల రుణాల పేరుతో సుమారు రూ.27 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు నిర్థారించారు. ఈ అంశంలో కౌలు రైతుల పేరుతో నకిలీ కార్డులు సృష్టించి రుణాలు మంజూరు చేసి కాజేశారు. సొసైటీ అధ్యక్షుడు ఫిర్యాదు చేయడంతో సహకార శాఖ అధికారులు ఆడిట్ చేసి అక్రమాలు నిర్థారించి అప్పటి డీసీసీబీ ప్రత్యేక అధికారి, జేసీ లక్ష్మీశాకు నివేదిక అందజేశారు. ఆ ఏడాది జరిగిన 20వ మహాజనసభలో ఈ అంశాన్ని ఆయనే స్వయంగా ప్రకటించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక అధికారిగా డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.ఎస్.ప్రకాష్‌ను నియమించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆ నివేదిక నేటికీ డీసీసీబీ సీఈవోకు అందలేదు. అక్రమాలకు పాల్పడినవారికి అధికారుల పెద్దల అండదండలు ఉండడం వల్లే జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రుణమంజూరులోనూ చేతివాటమే..
రాజమహేంద్రవరం బ్రాంచి పరిధిలోకి వచ్చే భూపాలపట్నం సొసైటీలో కంద సాగు చేస్తున్నామని కొందరు బినామీ రైతులు రూ.33 లక్షల రుణం తీసుకున్నారు. సుమారు మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణ చేసి అక్కడ కంద పండే అవకాశమేలేదని, రుణ మంజూరులో అక్రమాలు జరిగాయని గుర్తించారు. నివేదిక సమర్పించి ఏళ్లు గడుస్తున్నా నేటికి సంబంధిత బ్రాంచి మేనేజర్, సొసైటీ సీఈవోలపై చర్యలు లేవు.
* గండేపల్లి సొసైటీలో అరటి పంటకు రుణాలు మంజూరు చేశారు. అక్కడ అరటి పండదని గుర్తించి సంబంధిత సొసైటీ సీఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
తప్పు చేసినా చర్యలేవీ?
ఉమ్మడి జిల్లాలోని ఆత్రేయపురం డీసీసీబీ బ్రాంచిలో సుమారు రూ.1.40 కోట్లు దుర్వినియోగానికి పాల్పడి క్రమశిక్షణ చర్యలకు గురైన బ్రాంచి మేనేజర్ క్రాంతికృష్ణను సీతానగరం మండలంలోని రఘుదేవపురం శాఖకు బదిలీ చేశారు.అక్కడ రూ.11 లక్షల తప్పుడు లావాదేవీలు చేసినట్లు అప్పటి డీజీఎం కె.వెంకటేశ్వరరావు కేంద్ర కార్యాలయంలో నివేదిస్తూ క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. నివేదిక సమర్పించి సుమారు మూడు నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడంపై ఆ శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆత్రేయపురం వద్దిపర్రు శాఖలో ఒక మహిళా రైతుకు తెలియకుండానే ఆమె భూమిపై రూ.17 లక్షలు రుణం మంజూరు చేయడంపై ఫిర్యాదు చేశారు. విచారణలో వాస్తవాలు నిర్ధారించినా బాధ్యులపై చర్యలు లేవు.
తగిన చర్యలు...
రావులపాలెం సొసైటీకి సంబంధించిన కౌలురైతుల పేరుతో తీసుకున్న రుణాలు పూర్తిగా వసూలు చేశాం. ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు సొసైటీకి సంబంధించి రూ.కోటి రికవరీ చేశాం. మరికొంత మొత్తం వసూలు చేయాల్సి ఉంది. దీనిపై అమలాపురం డీఆర్‌కు సూచించాం. జిల్లా పునర్విభజన తరువాత ఆయా జిల్లాల అధికారులకు పూర్తి నివేదికలు పంపించాం. దీనిపై ఆయా జిల్లాల అధికారులు సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారు.
బీకే దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!