logo

ఇల్లండి... మావల్ల కాదండి

నవరత్నాల్లో భాగంగా మంజూరైన గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు.

Published : 30 Nov 2022 03:25 IST

న్యూస్‌టుడే, అమలాపురం(అల్లవరం), మండపేట

మండపేట: వేములపల్లి జగనన్న లేఔట్‌లో నిర్మాణాలు

నవరత్నాల్లో భాగంగా మంజూరైన గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. బిల్లులు మంజూరు చేస్తామన్నా.. లబ్ధిదారులు పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని అధికారులే చెబుతుండడం గమనార్హం. ప్రధానంగా వర్షాలు నిర్మాణాలకు ఆటంకం కలిగించాయని పేర్కొంటున్నారు. మరోవైపు నిర్మాణ సామగ్రి కొరత, ఆర్థిక ఇబ్బందులు, లేఔట్లలో మౌలిక వసతులు అరకొరగా ఉండడంతో పనులు చేయలేకపోతున్నామని నిర్మాణదారులు వాపోతున్నారు.

ప్రగతి మందగమనం..

నిర్మాణాలు ప్రారంభించకపోతే ఇళ్ల స్థలాలు రద్దవుతాయని అధికారులు చెప్పడంతో చాలామంది పనులు ప్రారంభించారు. ఆదిలో నిర్మాణాలు బాగానే సాగినా.. ఆ తర్వాత పురోగతి మందగించింది. ఎడతెరపిలేని వర్షాలు, కాలనీల్లో మౌలిక వసతుల లేమి, సామగ్రి తరలించుకునేందుకు ఇబ్బందులు ఎదురవడం తదితర కారణాలతో కొన్నిచోట్ల పనులు నిలిచిపోయాయి. గత నెల వరకు వర్షాల కారణంగా అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అమలాపురం తదితర మండలాల్లో జగనన్న లేఔట్లు ముంపునకు గురయ్యాయి. దీంతో నెలపాటు లబ్ధిదారులు, అధికారులు వీటిలో అడుగుపెట్టలేకపోయారు. ఈ క్రమంలో నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, ఇసుక కొరత ఏర్పడటం, ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ విలువ చాలకపోవడంతో లబ్ధిదారులకు గృహ నిర్మాణం భారంగా మారింది.

జిల్లా లక్ష్యం 6,203..

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోననసీమ జిల్లావ్యాప్తంగా డిసెంబరు నాటికి 6,203 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని లక్ష్యం నిర్ణయించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 50 శాతం అంటే 3,246 గృహాలు పూర్తి చేశారు. మిగిలిన వారికి అవగాహన కల్పించి, సౌకర్యాలు సమకూర్చి పనులు చేయించాల్సిఉంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయడం సాధ్యమయ్యేనా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

చాలని ప్రభుత్వ రుణం

ప్రభుత్వమిచ్చే సాయం తక్కువగా ఉండటం నిర్మాణదారులను ఇబ్బంది పెడుతోంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో కలిపి ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున అందజేస్తోంది. కూలీలతోపాటు సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ నగదుతో ఇంటి నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. మొదట్లో నాయకులు, అధికారులు ప్రభ్వుత్వం మూడు ఆప్షన్లు ఇస్తోందని.. ఒకటి.. లబ్ధిదారులు నిర్మించుకుంటే రుణం ఇవ్వడం, రెండు.. నిర్మాణ సామగ్రి కోరితే రాయితీ ధరలకు అందించడం, మూడు.. కోరితే ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ప్రకటనలు చేశారు. తీరా లబ్ధిదారులే నిర్మాణాలు చేపట్టాలని, లేదంటే ఇళ్ల స్థలాలు రద్దవుతాయని అధికారులు చెప్పడంతో చాలామంది నిర్మాణాలకు ముందుకు వచ్చారు. మూడో ఆప్షన్‌ కింద ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ఇవ్వాలని ఎక్కువ శాతం మంది కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తోడు నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలందిస్తామని వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం అధికారులు, సిబ్బంది డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తున్నారు.


అంధకారంగా ఉంటోంది

మాది మండపేటలోని తర్వాణిపేట. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నా. వేములపల్లి లేఔట్‌లో స్థలం ఇచ్చారు. ఇంటి అద్దెలు పెరగడంతో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నాం. వీధి దీపాల్లేక రాత్రి సమయంలో అంధకారంగా ఉంటోంది. ఇంకా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. సమీపంలోని స్తంభం నుంచి రూ.15 వేలు ఖర్చుచేసి తీగల ద్వారా ఇంటికి విద్యుత్తు సరఫరా చేసుకున్నాం. స్తంభాలు వేసినా.. తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయలేదు.

వెంకటేశ్వర్లు, వేములపల్లి


లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం

జిల్లావ్యాప్తంగా డిసెంబరు నాటికి ఆరు వేల గృహప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 52శాతం పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నిత్యం క్షేత్రస్థాయిలో అధికారులు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. నిర్మాణ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేలా అవగాహన కల్పిస్తున్నాం.

వై.శ్రీనివాస్‌, గృహనిర్మాణశాఖ పర్యవేక్షక ఇంజినీర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు