logo

బిల్లు రాకుంది... ఇల్లు కాకుంది...

గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పక్కా గృహాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల చెల్లింపు అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనేఉంది.

Published : 04 Dec 2022 02:57 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌, మండపేట

అల్లవరం: గోపాయిలంకలో అసంపూర్తిగానే గృహ నిర్మాణం

గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పక్కా గృహాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల చెల్లింపు అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనేఉంది. నాలుగేళ్ల కిందటే గృహ రుణాలు మంజూరైనవాటిలో చాలా వరకు అప్పట్లోనే నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 2019 ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు మందగించాయి. 2019 మార్చి నెలాఖరు వరకు బిల్లులు మంజూరు కాగా, ఆ తర్వాత నుంచి చెల్లింపులు నిలిపేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌ బకాయిలు విడుదల చేసేందుకు వీలుగా గ్రామ వాలంటీర్ల ద్వారా క్షేత్రస్థాయి సర్వే జరిపి అర్హులైన వారందరికీ బిల్లులు చెల్లించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార పార్టీ నాయకులు ప్రచారం చేసినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.

ఎదురుచూపులే మిగిలాయి..

తెదేపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులకోసం నాలుగేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. 2016-17 అర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు ఎన్టీఆర్‌ గ్రామీణ, పట్టణ గృహ పథకం ద్వారా గత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఇళ్లు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలోనూ పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించని వాటిని రద్దు చేయాలని వైకాపా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో నిర్మాణ పనులు ప్రారంభించని వారికి రుణాలు రద్దు చేశారు.

ఎక్కడివి అక్కడే..

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2020 డిసెంబరు నుంచి ఇళ్లస్థలాలు, పక్కా గృహాల మంజూరు ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా లేఔట్లు వేసి ఒక్కొక్కరికి సెంటున్నర స్థలం కేటాయించారు. జిల్లావ్యాప్తంగా 24,616 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం కేవలం కొత్తవాటికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ, పాత బకాయిల చెల్లింపు విషయం పూర్తిగా పక్కన పెట్టేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు గృహ నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రచారం నిర్వహించినా.. మూడున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా రాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

జిల్లావ్యాప్తంగా రూ.68.56 కోట్ల బకాయిలు

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 20,996 మంది లబ్ధిదారులకుగాను రూ.68,56,45,446 మేర బకాయిలు చెల్లింపులు నిలిచిపోయాయి. లబ్ధిదారులు వివిధ దశల్లో నిర్మాణాలు పూర్తి చేసినా, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో 2019 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. దాంతో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఈ పథకంలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లు అసంపూర్తిగానే దర్శనం ఇస్తున్నాయి.


ఇప్పటివరకు రూ.19 వేలే వచ్చింది

మాది మండపేట మండలం మారేడుబాక. 2019లో ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకుంటే.. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.1.50 లక్షలు మంజూరైంది. దాంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.19వేలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఆ తరువాత ఒక్క రూపాయి కూడా జమకాలేదు. బంధువుల వద్ద అప్పులుచేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఇప్పటికైనా అధికారులు బిల్లులు మంజూరుచేస్తే కొంత మేర ఉపశమనం పొందుతాం.

-బుంగ భవానీ


బిల్లు అవ్వలేదు.. నిర్మాణం నిలిచింది

మాది అల్లవరం మండలం గోపాయిలంక. మాకు 2017లో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహపథకంలో రుణం మంజూరైంది. పునాది దశ వరకు బిల్లు వచ్చింది. ఆ తర్వాత నుంచి రాలేదు. అప్పటినుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోయాం. ఇల్లు మంజూరైందని పాత ఇంటిని కూల్చి నిర్మాణం చేపట్టాం. రెండూ లేకుండాపోయాయి. డబ్బులు సమకూరినప్పుడల్లా కొంతవరకు పనులు చేపడుతున్నాం. ఇప్పటికైనా పూర్తిస్థాయి బిల్లు మంజూరుచేస్తే నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుంటాం.

- వంగా సూరిబాబు


ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం..

ఎన్టీఆర్‌ పట్టణ, గ్రామీణ పథకంలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి బిల్లు బకాయిల గురించి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నిధులు మంజూరుచేయగానే లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తాం.

- వై.శ్రీనివాస్‌, గృహనిర్మాణశాఖ, పర్యవేక్షక ఇంజినీర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని