logo

పోషక.. సౌకర్యం

అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని 100 శాతం మంది తినేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.

Published : 04 Dec 2022 02:57 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

బోడసకుర్రు అంగన్‌వాడీ కేంద్రంలో ఇంటికి పోషకాహారం తీసుకెళుతున్న లబ్ధిదారుల కుటుంబ సభ్యులు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని 100 శాతం మంది తినేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకోసం అధికారులు నిబంధనలు సడలించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రాలేని 9, 10 నెలల గర్భిణులు, నెలల బాలింతలకు వండిన ఆహార పదార్థాలను వారిళ్లకే పంపించేందుకు అవకాశం కల్పించారు.

వివిధ కారణాలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. అలాంటివారి కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు కార్యకర్తలు బాక్సుల్లో ఇంటికి ఇచ్చేవారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకంలో భోజనం చేసినవారి వివరాలు యాప్‌లో నమోదు చేసినపుడు భోజనం చేయనివారి గురించి ఉన్నతాధికారులు ఆరా తీయగా అంగన్‌వాడీ కేంద్రాలు దూరంగా ఉండటం, 9, 10 నెలల గర్భిణులు, బాలింతలు నడిచి కేంద్రాలకు రావడానికి ఇబ్బందిపడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. దాంతో కేంద్రాలకు వచ్చినవారికి వడ్డించాలని, రాలేనివారికి ఇళ్లకు పంపాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి.

కేంద్రాలకు వచ్చేందుకు అనాసక్తి..

అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలకు రెండేళ్లుగా కరోనా కారణంగా పోషకాహార సరకులు ఇంటికే ఇచ్చేవారు. కరోనా తగ్గుముఖంతో లబ్ధిదారులకు కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం వేడివేడిగా వండి పెట్టాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. దాంతో ఈ ఏడాది జులై ఒకటో తేదీనుంచి గర్భిణులు బాలింతలకు కేంద్రాల్లోనే వండి పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనా.. ఆశించిన ఫలితాలు రాలేదు. కేంద్రాలకు వచ్చేందుకు లబ్ధిదారులు సుముఖత చూపకపోవడంతో పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య పెరిగింది. దాంతో ఉన్నతాధికారులు నూతన నిర్ణయం తీసుకున్నారు.

కారణాలివీ..

* రెండేళ్లుగా ఇంటికే రేషన్‌ ఇచ్చి, ఒక్కసారిగా కేంద్రాలకు వచ్చి తినాలంటే కష్టంగా ఉంటోందని చాలామంది చెబుతున్నారు.

* కేంద్రం ఇళ్లకు దూరంగా ఉన్నవారు రావడానికి ఇష్టపడటం లేదు. సమీపంలో ఉన్నవారు మాత్రమే వస్తున్నారు.

* కేంద్రానికి రావాలంటే.. బాలింతలు బిడ్డల్ని ఇంటివద్దే వదిలిరావాల్సివస్తుండడం.

* ప్రసవ సమయం దగ్గిరపడినవారు దూరం నడవలేకపోవడం.


పోషకాహారం అందించడమే లక్ష్యం

అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలకు 100శాతం పోషకాహారం అందించడమే లక్ష్యంగా పని చేయాలని సిబ్బందిని ఆదేశించాం. కేంద్రాలకు రాలేని లబ్ధిదారుల కుటుంబసభ్యులు వస్తే బాక్సుల్లో పోషకాహారం పెట్టిస్తారు.

-సత్యవేణి, మహిళా శిశుసంక్షేమ శాఖ, జిల్లా అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని