logo

మనసు రాదా.. మహాశయా?

కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి(సీఎండీఎఫ్‌) కింద చేపట్టాల్సిన పనులకు అడుగు పడటం లేదు.

Published : 04 Dec 2022 02:57 IST

కరప: పాతర్లగడ్డలో నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిన వంతెన

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి(సీఎండీఎఫ్‌) కింద చేపట్టాల్సిన పనులకు అడుగు పడటం లేదు. ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండు కోట్లు చొప్పున సీఎండీఎఫ్‌ కింద 2022-23కు నిధులు మంజూరు చేశారు. దీనికి సంబంధించి జులై 18న మార్గదర్శకాలు జారీ చేస్తూ 18 రకాల పనులకు వీటిని వినియోగించాలని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి మంజూరు చేసిన రూ.రెండు కోట్లలో షెడ్యూల్డ్‌ కులాలకు(ఎస్సీ) 17.08శాతం చొప్పున రూ.34.16 లక్షలు, షెడ్యూల్డ్‌ తెగలకు(ఎస్టీ) 5.53 శాతం చొప్పున రూ.11.06 లక్షలు ఖర్చు చేయాలని ఉత్తర్వులిచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల జనాభాకు అనుగుణంగా రూ.రెండు కోట్లను వివిధ పనులకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.

రెండు నియోజకవర్గాల్లో..

జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం నియోజకవర్గాలకు ఒక్కోచోట రూ.రెండు కోట్లు చొప్పున రూ.14 కోట్లు మంజూరు చేశారు. నవంబరు 30 నాటికి అయిదు నియోజకవర్గాల పరిధిలో కేవలం రూ.5.91 కోట్లతో చేపట్టే పనులకే ప్రతిపాదనలు రాగా కలెక్టర్‌ ఆమోదం ఇచ్చారు. ఇంకా రెండు నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు రాకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, నాలుగు నెలలైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనులకు ప్రతిపాదనలు రాలేదు. ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే ప్రజలకు సౌకర్యాలు ఒనగూరే అవకాశం ఉంది. 2023, మార్చి 31లోగా ప్రతిపాదనలు రాకపోయినా, వచ్చిన వాటిని ఆమోదించకపోయినా నిధులు వెనక్కి పోతాయి.

పెద్దాపురంపై పీటముడి

కాకినాడ జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కేటాయించిన రూ.రెండు కోట్ల సీఎండీఎఫ్‌ నిధులకు సంబంధించి ప్రతిపాదనలు ఎవరు పెట్టాలనే దానిపై స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొనలేదు. దీంతో పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపితే, ఆమోదిస్తారా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

*  కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సీఎండీఎఫ్‌ కింద మంజూరు చేసిన రూ.రెండు కోట్ల నిధులకు ఇప్పటికీ ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపలేదు. పనులను గుర్తించే పనిలోనే ఉన్నారు.

* ప్రస్తుతం పిఠాపురం, కాకినాడ నగరం, తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రూ.5.91కోట్లతో 45 పనులు చేపట్టేందుకు పరిపాలనామోదం ఇచ్చారు. వీటిలో పెద్ద పనులనే ప్రతిపాదించారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒకే పనిని రూ.1.10కోట్లతో చేపట్టేలా ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపారు. మళ్లీ దీనికి మార్పు చేసేలా, ఒకేపనికి ఇంత మొత్తంలో నిధులు ఇచ్చేస్తే మిగతా పనుల పరిస్థితి ఏంటని భావించి, ప్రస్తుతానికి వీటిని నిలిపివేయాలని కోరారు.

* తుని, కాకినాడ నగర నియోజకవర్గాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.రెండు కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. కాకినాడ నగర నియోజకవర్గంలో ఇప్పటికి రూ.95లక్షల విలువైన మూడు పనులు చేపట్టేందుకు కలెక్టర్‌ పరిపాలనామోదం ఇచ్చారు. మిగతా రూ.1.05కోట్ల నిధులకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు ఇచ్చినా, ఆయా శాఖల నుంచి ఎస్టిమేట్‌ వివరాలు కలెక్టరేట్‌కు చేరకపోవడంతో వీటికి ఇంకా పరిపాలనా ఆమోదం ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని