logo

ఆత్మవిశ్వాసంతో ఉజ్వల భవిత

విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ఉజ్వల భవితను అందుకోవాలని కాకినాడ ఎంపీ వంగా గీత సూచించారు. జేఎన్‌టీయూకే అలూమ్ని సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు.

Published : 04 Dec 2022 02:57 IST

లబ్ధిదారుకు వాహనం అందజేస్తున్న ఎంపీ గీత, కలెక్టర్‌ కృతికాశుక్లా

వెంకట్‌నగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ఉజ్వల భవితను అందుకోవాలని కాకినాడ ఎంపీ వంగా గీత సూచించారు. జేఎన్‌టీయూకే అలూమ్ని సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల పట్ల సహనంతో వ్యవహరించాలన్నారు. ముఖ్యమంత్రి దివ్యాంగులను ఆదుకునేందుకు మూడు చక్రాల స్కూటీతో పాటు ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నారని, నియోజకవర్గానికి 10 చొప్పున 70 స్కూటీలు మంజూరు చేశారన్నారు. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే మరిన్ని మంజూరుకు కృషిచేస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సదరమ్‌ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను సరళతరం చేసి, మంగళ, శుక్రవారాల్లో క్యాంపులు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ ఛైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పట్టాన్‌ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం మూడు చక్రాల స్కూటీలను పారదర్శకంగా పంపిణీ చేస్తోందని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం 5 మూడుచక్రాల సైకిళ్లు, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్థ సామాజిక బాధ్యతగా ఉమా మనో వికాస కేంద్రం సమన్వయంతో రూ.7.5 లక్షల విలువైన వివిధ రకాల 58 ఉపకరణాలను అందించారు. ఆటల పోటీల్లో విజేతలు 264 మందికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వాడ్రేవు కామరాజు, ఉమా మనోవికాస కేంద్రం ఈడీ ఎస్‌.పి.రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ఐఈ కోఆర్డినేటర్‌ చామంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని