logo

పట్టుంటేనే పట్టాభిషేకం!

చేతిలో పట్టా ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సంపాదించిన వాళ్లు, కొత్త సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉన్నవాళ్లు  జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతూ ఉంటారు.

Updated : 05 Dec 2022 06:27 IST

సీతానగరంలో ఇంటింటా సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేలో విద్యార్థులు

న్యూస్‌టుడే, సీతానగరం: చేతిలో పట్టా ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సంపాదించిన వాళ్లు, కొత్త సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉన్నవాళ్లు  జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతూ ఉంటారు. ఇది ప్రస్తుతం మారుతున్న నూతన విద్యావిధానంలో ఒక భాగమవుతోంది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే దీనికి అనుగుణంగా అడుగులు వేసే ప్రయాణమే విద్యార్థుల నైపుణ్య సముపార్జన శిక్షణ. డిగ్రీ కళాశాలల్లో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసేవారికి ఏడాదికో సామాజిక అంశం పూర్తిచేస్తేనే పట్టా ఇచ్చేలా విశ్వవిద్యాలయం ఇచ్చిన ఆదేశాలతో విద్యార్థులతో ఆయా అంశాలను అధ్యాపకులు పూర్తిచేయిస్తున్నారు.

ఎలా అంటే..?

ప్రథమ సంవత్సరంలోని విద్యార్థులంతా ‘కమ్యూనిటీ సర్వీసెస్‌ ప్రోగ్రాం’ పేరుతో గ్రామాల్లో సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వే పూర్తి చేస్తున్నారు. మండలాల్లో ఉండే అన్ని గ్రామ పంచాయతీల్లో వార్డులను విభజించుకుని ఆరుగురు విద్యార్థుల చొప్పున ఇంటింటా సర్వే చేసి విశ్వవిద్యాలయానికి అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఆయా చోట్ల మౌలిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, రహదారులు, వైద్యం, విద్య తదితర వాటిని పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేకంగా నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు చేరుతున్నాయా..? లేదా..? అనే వివరాలు సేకరిస్తున్నారు.

ద్వితీయ సంవత్సరం వచ్చే సరికి రెండునెలల పాటు నైపుణ్య  సముపార్జన (ఇంటర్న్‌ షిప్‌) పూర్తి చేయాలి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని పరిశ్రమల్లో నైపుణ్య సముపార్జన సాధించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సాధించాలి.
తృతీయ సంవత్సరం వచ్చేసరికి ఆరునెలలు పాటు ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో నైపుణ్యం సముపార్జన పూర్తిచేయాలి. మూడేళ్లలో ఇవి సాధించిన వారికే డిగ్రీ పట్టా అందజేస్తారు.

ఎందుకిలా..

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువతగా మారకూడదనే లక్ష్యంతో విద్యాలయంలో మొదటి సంవత్సరం ప్రారంభం నుంచే వివిధ అంశాల్లో  నైపుణ్యం సాధించేలా ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పుస్తకాలు బట్టీ పట్టడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉండదని, సామాజిక అంశాల్లో నైపుణ్యం సాధించడం వల్ల వారిలో ప్రతిభా పాటవాలు బయటపడతాయంటున్నారు. వీటిని పూర్తిచేయించేలా అధ్యాపకుల్లోనే ఒకరిని సమన్వయకర్తగా నియమించారు. వివిధ పరిశ్రమల్లో నైపుణ్యం సముపార్జన పూర్తిచేసినట్లుగా ధ్రువీకరణ పత్రాలను అంతా పొందాల్సిందే.


నైపుణ్యం సముపార్జనకు వంద మార్కులు

డిగ్రీ విద్యార్థులకు నైపుణ్య సముపార్జనలో 75 మార్కులు క్షేత్రస్థాయిలో సాధించాలి. మిగతా 25 మార్కులు మౌఖిక పరీక్ష ఉంటుంది. మొదటి సంవత్సరంలో సామాజిక ఆర్థిక సర్వే చేసిన నివేదికలన్నీ విశ్వవిద్యాలయానికి పంపిస్తాం. 18 గ్రామాల్లో ఇప్పటివరకు 14,879 కుటుంబాల్లో సర్వే పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, కడియం తదితరచోట్ల నైపుణ్య సముపార్జన శిక్షణ పూర్తిచేశారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పూర్తిచేసే సమయంలో రవాణా ఇతరత్రా ఖర్చులన్నీ విశ్వవిద్యాలయమే భరిస్తోంది.

- వీవీ సుబ్బారావు, సమన్వయకర్త, సీతానగరం డిగ్రీ కళాశాల

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని