logo

మూడోసారీ.. కోతలతంతే..!

రేషన్‌ సరకుల కోత కొనసాగుతోంది.. రెండు నెలలుగా కందిపప్పు అరకొరగా సరఫరా చేయగా.. పంచదార పూర్తిగా నిలిపేశారు.

Published : 05 Dec 2022 06:20 IST

ఎండీయూ వాహనంలో రేషన్‌ సరకుల పంపిణీ

కాకినాడ కలెక్టరేట్‌: రేషన్‌ సరకుల కోత కొనసాగుతోంది.. రెండు నెలలుగా కందిపప్పు అరకొరగా సరఫరా చేయగా.. పంచదార పూర్తిగా నిలిపేశారు. ఈ నెల ఒకటి నుంచి ఎండీయూ వాహనాలు ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ మొదలయ్యింది. జిల్లాలోని 6.52 లక్షల బియ్యంకార్డులకు బియ్యం, కందిపప్పు, పంచదార కేటాయింపులు చేశారు. బియ్యం మినహా ఇతర సరకుల నిల్వలు అరకొరగా ఉండడంతో తక్కువ మొత్తంలో మండలస్థాయి నిల్వ కేంద్రాల నుంచి చౌక దుకాణాలకు సరఫరా చేశారు. దీంతో ఈ నెలా పూర్తిస్థాయిలో సరకులు అందే పరిస్థితి లేదు. మూడు నెలలుగా పూర్తి స్థాయిలో కేటాయింపులు చేసి, సరఫరా మాత్రం అరకొరగా చేస్తున్నారు. ప్రతి నెలా 90 శాతం కార్డులకు రేషన్‌ సరకులు పంపిణీ చేస్తున్నామని లెక్కలు చూపుతున్నా.. వీటిలో కందిపప్పు, పంచదార మాత్రం అందడంలేదు. బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో రాయితీపై ఇచ్చే సరకుల కోసం పేదలు ఎదురుచూసినా నిరాశ తప్పడంలేదు.

అరకొరగా పంపిణీ

జిల్లాలోని కార్డుదారులకు ఈనెల 641 టన్నుల కందిపప్పు పంపిణీ చేసేందుకు కేటాయించగా.. కేవలం 18 టన్నులు మాత్రమే ఇప్పటి వరకు సరఫరా చేశారు. 331 టన్నుల పంచదార కేటాయించినా 59 టన్నులు మాత్రమే చౌక దుకాణాలకు చేరవేశారు. 9,280 టన్నుల బియ్యాన్ని కేటాయించగా. ఇప్పటికి 7,800 టన్నులు సరఫరా చేశారు. వాస్తవంగా ప్రతి నెల 25 నుంచి రేషన్‌ సరకులను చౌక దుకాణాలకు తరలించే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆదివారం నాటికి బియ్యం మినహా కందిపప్పు, పంచదార 10 శాతం కూడా సరఫరా చేయలేకపోయారు. 

కేటాయింపులకే పరిమితం..

జిల్లాలోని బియ్యంకార్డులకు అర కేజీ పంచదార రూ.13.50, ఏఏవై కార్డుకు కేజీ రూ.17 చొప్పున రాయితీ అందిస్తున్నారు. అక్టోబరు, నవంబరు నెలలకు పూర్తి పంచదార సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడు నెలలకు పంచదార కేటాయింపులు చేశారు. ఏఏవై కార్డుకు ఈనెల 3 కేజీలు, మిగతా కార్డులకు 1.50 కేజీల పంచదార ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని 1,060 చౌక దుకాణాలకు ఇప్పటికి కేవలం 59 టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద 143 టన్ను నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల ప్రకారం మూడు నెలలకు 900 టన్నుల మేర పంచదార విడుదల చేయాల్సి ఉంది. 

అన్ని సరకులు అందిస్తాం..

బియ్యం నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. 85 శాతం ఇప్పటికే చౌక దుకాణాలకు తరలించాం. కందిపప్పు రోజూ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తోంది. ప్రస్తుతం 100 టన్నుల నిల్వలు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు చౌక దుకాణాలకు చేరవేస్తాం. పంచదార మూడు నెలలకు కేటాయింపులు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను ఎండీయూల ద్వారా కార్డుదారులకు అందిస్తున్నారు. ఈ నెల 17లోగా అన్ని కార్డులకు కేటాయించిన సరకులు బట్వాడా జరిగేలా చర్యలు తీసుకుంటాం.

డి.పుష్పమణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, కాకినాడ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని