logo

పనిభారం తగ్గించకుంటే ఉద్యమిస్తాం

రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, లేకుంటే ఉద్యమిస్తామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యవర్గం డిమాండ్‌ చేసింది.

Published : 05 Dec 2022 06:20 IST

మాట్లాడుతున్న  త్రినాథరావు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, లేకుంటే ఉద్యమిస్తామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యవర్గం డిమాండ్‌ చేసింది. ఆదివారం కాకినాడ, రెవెన్యూ భవన్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర సహ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర శాఖలకు సంబంధించిన విధులను రెవెన్యూ ఉద్యోగులపై మోపుతున్నారని ఆరోపించారు. వరి నాట్లు, ధాన్యం అమ్మకాలు, సినిమా టికెట్ల విక్రయాలకు రెవెన్యూ ఉద్యోగులను వినియోగించడం తగదన్నారు. ఉదయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌తో మోత మోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల విధులకు తప్ప సెలవు రోజుల్లో విధులకు హాజరుకాలేమని, ఇతర శాఖల పనులు చేయలేమని, టెలీకాన్ఫరెన్స్‌లు తగ్గించాలని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. సమావేశంలో సంఘ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి క్రాంతి ప్రసాద్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, వీఆర్వో సంఘ ప్రతినిధులు చిన్నా, సాయిరెడ్డి, వీఆర్వో సంఘ ప్రతినిధి వెంకట్రావు, సర్వే సంఘ నాయకుడు సత్యనారాయణ, తహసీల్దార్లు తేజేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రసాద్‌, గోపాలకృష్ణ, సూర్యారావు, మురార్జీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని