logo

ప్రోత్సాహం.. అందుకుంటే ప్రయోజనం

ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవచ్చు.

Published : 05 Dec 2022 06:23 IST

తుంపర సేద్య పరికరం

కాకినాడ నగరం, సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన శాఖ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు సాగు చేసే రైతులకు రాయితీ ద్వారా సూక్ష్మ సేద్య నీటి పరికరాలను అందజేస్తోంది. తక్కువ పెట్టుబడి, నీటి ఆదా ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో రైతులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసినా.. వాటిని పొందేందుకు చెల్లించాల్సిన వాటా మొత్తం చెల్లించకపోవడంతో పథకాల లబ్ధి ఎవరికీ అందని పరిస్థితి నెలకొంది.

రైతు వాటాచెల్లించడంలో వెనుకంజ

కినాడ జిల్లాకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ నీటి సాగు పథకం కింద 2 వేల హెక్టార్ల (5 వేల ఎకరాలు) మేర సాగుకు అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు నిర్ణయించారు. అయితే 1,865 హెక్టార్ల (4,665 ఎకరాలు)కు సంబంధించి రైతులు నమోదు పూర్తి చేసినా 800 ఎకరాలకు మాత్రమే తమ వాటా ధనాన్ని (డీడీలు) చెల్లించారు. ఇంకా సుమారు 4 వేల ఎకరాల రైతులు డీడీలు చెల్లించాల్సి ఉంది. మరో 300 ఎకరాల మేర రైతుల నుంచి ఇంకా దరఖాస్తులు రావాలి. వీటికి సంబంధించిన దరఖాస్తులను గ్రామస్థాయిలో ఆర్బీకేల్లో స్వీకరిస్తున్నారు. ఈ పథకం గురించి రైతులకు అవగాహన కల్పించి, ముందుకు తీసుకురావడంలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్లే ఈ సమస్య నెలకొంది. కౌలు రైతులు దరఖాస్తు చేసేందుకు వారి వద్ద అవసరమైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా పోతుంది. కౌలు రైతులు సీసీఆర్‌సీ కార్డుతోపాటు, ఏడేళ్ల లీజు ఒప్పందం ధ్రువీకరణపత్రం ఉంటేనే నమోదు అవుతుంది.

రాయితీపై  బిందు, తుంపర సేద్య పరికరాలు

డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం కింద మెట్ట ప్రాంతానికి చెందిన చిన్న, సన్నకారు రైతులకు 2 హెక్టార్లకు మించకుండా 90 శాతం వరకు (రూ.2.13 లక్షలు మించకుండా..) రాయితీపై పరికరాలు అందజేస్తారు. ఇతర ప్రాంత రైతులకు 2 నుంచి 5 హెక్టార్లలోపు 50 శాతం రాయితీపై రూ.3.20 లక్షలు మించకుండా పరికరాలు ఇస్తారు.
* తుంపర సేద్యానికి చిన్న, సన్నకారు రైతులకు 2 హెక్టార్లు మించకుండా 55 శాతం రాయితీపై, ఇతర రైతులకు 2 నుంచి 5 హెక్టార్లకు మించకుండా 45 శాతం రాయితీపై పరికరాలు అందజేస్తారు.


సద్వినియోగం  చేసుకోండి..

 

రాయితీపై ఇచ్చే బిందు, తుంపర సేద్య పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసిన రైతులందరూ తమ వాటా ధనాన్ని డీడీల రూపంలో చెల్లించాలి. ఆసక్తి ఉన్నవారు ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. డీడీల చెల్లింపుల్లో కాకినాడ జిల్లా వెనకంజలో ఉన్న మాట వాస్తవమే. క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నా.

స్వాతి, జిల్లా మైక్రో ఇరిగేషన్‌ అధికారిణి, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని