logo

అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ విచారణ

అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.

Published : 06 Dec 2022 04:00 IST

ఆలయ ప్రాంగణంలో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ పనులు పరిశీలిస్తున్న అధికారులు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. దేవస్థానంలో పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని గత ధర్మకర్తల మండలి సభ్యుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో గత ఏడాది డిసెంబరులో ఆయా అంశాలపై విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఇది కొనసాగుతోంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో భాగంగా అయిదేళ్లలో ఇంజినీరింగ్‌ పనుల్లో అవకతవకలు జరిగాయన్న అంశంపై పరిశీలన చేస్తున్నారు. 2015 నుంచి జరిగిన పనులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు తాజాగా విజిలెన్స్‌ డీఈ కృష్ణ ఆధ్వర్యంలో జేఈలు, ఏఈల బృందం విచారణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని రామాలయం వద్ద గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, కొండ దిగువన దేవస్థానం ఉద్యానం రక్షణ గోడ నిర్మాణం, దిగువ ఘాట్‌ రోడ్డులో పంపా ఘాట్‌ సమీపంలో సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. వీటి అంచనాలు ఎంత, టెండర్లలో ఎంత కోడ్‌ చేశారు, ఎంత కాలంలో పనులు పూర్తి చేశారు? తదితర వివరాల రికార్డులు పరిశీలించారు. పనుల నాణ్యత తనిఖీ చేశారు. టెండర్లకు అనుగుణంగా పనులు జరిగాయా లేదా అన్నదానిపై కొలతలు తీసుకున్నారు. వీటిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక సిద్ధం చేస్తామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని