logo

కొవ్వూరులో రైతు సమాచార కేంద్రం

కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానంలో త్వరలో రైతు సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయ ఉప కులపతి టి.జానకిరామ్‌ వెల్లడించారు.

Published : 06 Dec 2022 04:00 IST

వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి జానకిరామ్‌

సాగు, పరిశోధన అంశాలతో కూడిన కరపత్రాలను
ఆవిష్కరిస్తున్న ఉప కులపతి జానకిరామ్‌, శాస్త్రవేత్తలు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానంలో త్వరలో రైతు సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయ ఉప కులపతి టి.జానకిరామ్‌ వెల్లడించారు. కేంద్రీయ దుంప పంటల పరిశోధన కేంద్రం (తిరువనంతపురం) ఆధ్వర్యంలో సోమవారం కొవ్వూరు ఉద్యాన పంటల పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త జి.రామానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా జానకిరామ్‌, తిరువనంతపురం కేంద్రం నుంచి గౌరవ అతిథులుగా ప్రధాన శాస్త్రవేత్తలు ఎస్‌.సునీత, ఎం.ఎన్‌.షీలా హాజరయ్యారు. జానకిరామ్‌ మాట్లాడుతూ కొవ్వూరులో కంద, చేమ, పెండలం, పెద్దాపురం కేంద్రంలో చిలకడదుండ, కర్ర పెండలం దుంపలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పెండలంలో శబరి అనే రకం హెక్టారుకు 35, చిలకడదుంప అరిణిమ 25, కర్ర పెండలంలో ఆదిత్య 40 నుంచి 45 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. ఈ మూడు పంటలను రాష్ట్ర గెజిట్‌ నోటిఫికేషన్‌లో నోటిఫై చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు కొవ్వూరు స్థానానికి రూ.13 లక్షలు మంజూరు కాగా స్ప్రేయర్లు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర సామగ్రిని రైతులకు అందజేశామన్నారు. తిరువనంతపురం శాస్త్రవేత్తలు దుంప పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, నూతన పరిశోధనలపై అవగాహన కల్పించారు. వీటిపై ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రైతులకు పోషకాలు, పురుగు మందులు అందజేశారు. మధ్యాహ్నం దుంప పంటల సాగుపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అంబాజీపేట ప్రధాన శాస్త్రవేత్త బి.శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు ఎల్‌.నాయుడు, కొవ్వూరు, పెద్దాపురం స్థానాల శాస్త్రవేత్తలు కె.మమత, ఎం.జానకి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా రైతులకు సాగు అంశాలను వివరించారు. శాస్త్రవేత్తలు కె.రవీంద్రకుమార్‌, ఎ.స్నేహలతారాణి, సీహెచ్‌ఎస్‌ కిషోర్‌కుమార్‌, ఎం.విశ్వనాథ్‌, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని