logo

భక్తులను ఇబ్బంది పెడితే చర్యలు

అన్నవరం సత్యదేవుని వ్రతం ఆచరించేందుకు వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేసినా, వారికి అసౌకర్యం కలిగించినా బాధ్యులైన పురోహితులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌, ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు.

Published : 06 Dec 2022 04:00 IST

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని వ్రతం ఆచరించేందుకు వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేసినా, వారికి అసౌకర్యం కలిగించినా బాధ్యులైన పురోహితులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌, ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు. ఓ భక్తుడు ఆదివారం రూ.1,500 రుసుముతో వ్రతం చేయించుకున్నారు. ఈ సమయంలో ఆవాహన, పూజ, కథ ఒకే పురోహితుడు మైక్‌ ద్వారా చెప్పి భక్తులతో చేయించారు. వ్రతం ఆచరించే భక్తులకు ముందుగా ఎవరికి వారికి ప్రత్యేకంగా పురోహితుడు ఆవాహన చేయించాలి. తర్వాత పూజ, కథ మైక్‌ ద్వారా చెబుతారు. ఆవాహన ప్రత్యేకంగా చేయించకుండా అందరికీ మైక్‌ ద్వారా ఆవాహన, పూజ చేయించడం, కథ చెప్పడంపై భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విభాగ అధికారులు, పురోహిత సంఘం నాయకులతో ఛైర్మన్‌, ఈవోలు సోమవారం చర్చించారు. ఆవాహన ప్రత్యేకంగా ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. తాము తక్కువ సంఖ్యలో ఉన్నామని పురోహితులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై ఛైర్మన్‌, ఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇబ్బంది అయితే చెప్పాలని మరికొంత మంది పురోహితులను నియమిస్తామన్నారు. ఇప్పటికే పురోహితుల సంఖ్య పెంచడంతో పాటు, వ్రతటికెట్ల అమ్మకం ద్వారా దేవస్థానానికి వచ్చే ఆదాయంలో పురోహితులకు ఇచ్చే కమిషన్‌ను 30 నుంచి 40 శాతానికి పెంచినా నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానాల పేరుతో భక్తుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే విధుల నుంచి శాశ్వతంగా తప్పిస్తామన్నారు. అంతా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. నిర్దిష్టమైన సమయానికి విధులు నిర్వర్తించాలని, ఇకపై బయోమెట్రిక్‌ ద్వారా హాజరును కచ్చితంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని