logo

కాల్వల పాలిట.. కాలుష్యాసురులు

ఒకప్పుడు కాలువల్లోని నీరు దోసెళ్లతో పట్టుకుని తాగితే.. ఇప్పుడు వాటిని చూసి అమ్మో.. అనే పరిస్థితి. లక్షల మంది దాహార్తి తీర్చే కాలువలు కాలుష్య కారకాలతో నిండిపోతున్నాయి.

Published : 07 Dec 2022 02:51 IST

ఈనాడు, అమలాపురం- న్యూస్‌టుడే, మండపేట, అల్లవరం

ఒకప్పుడు కాలువల్లోని నీరు దోసెళ్లతో పట్టుకుని తాగితే.. ఇప్పుడు వాటిని చూసి అమ్మో.. అనే పరిస్థితి. లక్షల మంది దాహార్తి తీర్చే కాలువలు కాలుష్య కారకాలతో నిండిపోతున్నాయి. గోదావరితో పాటు ఇతర నీటి వనరులకూ ఈ సమస్య తప్పడం లేదు. కొన్ని పరిశ్రమల యాజమాన్యాల నిర్వాకం వల్ల ఈ దుస్థితి తలెత్తుతోంది. కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థ, రసాయన జలాలను నిబంధనల ప్రకారం శుద్ధిచేసి మాత్రమే జలవనరుల్లో వదలాలి. కానీ కొంతమంది ఖర్చు తగ్గించుకోడానికి రాత్రి వేళల్లో నేరుగా కాలువల్లోకి వదలడం వల్ల తాగు, సాగునీరు కలుషితమవుతోంది.


కూతవేటు దూరంలోనూ అతిక్రమణే..

అల్లవరం: ఓడలరేవు వద్ద తూరల ద్వారా రైతుల భూముల్లోకి వస్తున్న వ్యర్థజలాలు

కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేట ప్రాంతంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ఉంది. ఇక్కడికి కూతవేటు దూరంలోనే పదుల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. రాజకీయ జోక్యంతో వ్యవహారం ఇష్టా రీతిన సాగుతోంది. ఇతర మండలాల్లోనూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు.


వ్యర్థ జలాలన్నీ వాటిలోకే..

గాడేరు కాలువలో కాలుష్యం కారణంగా నల్లగా మారిన జలాలు

సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లోని కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేస్తున్నారు. సాగో, రొయ్యల శుద్ధి, అట్టల పరిశ్రమల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట ప్రజలకు తాగునీరందించే వనరులపైనా ఈ ప్రభావం పడుతోంది. ఏలేరు కాలువ పరిధిలో పంటలు దెబ్బతింటున్నాయి. కలుషిత జలాల దుర్వాసనకు సామర్లకోటలోని గణేష్‌ కాలనీ, కుమ్మరవీధి, ఉప్పువారి వీధి తదితర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


శుద్ధి చేయకుండా..  సముద్రంలోకి

వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలో కాలువలో ప్రవహిస్తున్న వ్యర్థజలాలు

కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సమీప సాగర తీరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. శుద్ధి కేంద్రాలున్నా.. ఖర్చు మిగుల్చుకోవడానికి రాత్రి వేళల్లో నేరుగా కాలువల్లోకి, సముద్రంలోకి రసాయనాలు వదిలేస్తున్నారు. ట్యాంకర్లను యాసిడ్‌తో కడుగుతుంటారు. ఆ వ్యర్థాలు కాలువల్లోకి వదిలేస్తుండటంతో స్థానికులకు, మత్స్య సంపదకూ కాలుష్యం సెగ తగులుతోంది. ఇక్కడ 16 మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిపై సరైన పర్యవేక్షణ లేదు.


జీవనదికీ జలగండం..

రాజమహేంద్రవరం నగరంలోని మురుగు గోదావరిలో కలుస్తోందిలా..

గోదావరి కాలుష్యం ప్రభావం రాజమహేంద్రవరం నగర వాసులతోపాటు.. ఈ జలాలపై ఆధారపడే దిగువ మండలాలపైనా పడుతోంది. పేపరు మిల్లు వ్యర్ధాలు నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారంటూ ఆందోళనలు సాగుతున్నాయి.  గోదావరి పరిరక్షణకు తలపెట్టిన నమామి గోదావరి ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడం సమస్యగా మారింది. నగరంలోని మురుగు నేరుగా నల్లా, ఆవ ఛానల్‌ ద్వారా గోదావరిలోకి వదిలేస్తున్నారు. శుద్ధి కేంద్రాల ఏర్పాటు, కాలుష్య కట్టడి ప్రహసనంలా మారింది.  


నురగలు కక్కుతున్నా..

మండపేటలో ఇప్పనపాడు వద్ద తుల్యభాగ నదిలో విషతుల్య జలాలు

* కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలను కలుషిత జలాలు సమస్య వేధిస్తోంది. సాగర తీరం 161 కి.మీ, గోదావరి పరీవాహక ప్రాంతం 260 కి.మీ. మేర ఉంది. పలుచోట్ల కలుషిత సమస్యలు వేధిస్తున్నాయి.

* తుల్యభాగ నదీ జలాలు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితం అవుతున్నాయి. కడియం మండలం జేగురుపాడు నుంచి ప్రారంభమైన ఈ డ్రెయినేజీ.. మండపేట, రాయవరం, అనపర్తి, బిక్కవోలు, రామచంద్రపురం, కరప మండలాల్లోని గ్రామాల మీదుగా 57 కి.మీ. మేర సాగుతూ సముద్రంలో కలుస్తోంది. కాలుష్య తీవ్రత కారణంగా ఈ నీటిలోకి దిగితే దురదలు, చర్మవ్యాధులు ఖాయం.

* కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం తదితర మండలాల్లో తాగునీటి వనరులు కలుషితమై ఉప్పునీటి సమస్య ఎదురవుతోంది. దీనికి ఆక్వా కాలుష్యమే కారణమన్న ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ‘సిబా’ నిపుణుల కమిటీ అధ్యయనం అటకెక్కింది.


సమస్య తీవ్రత  చాలా ఎక్కువ

పారిశ్రామిక వ్యర్థాలు ఇష్టానుసారంగా శుద్ధిచేయకుండా కాలువల్లోకి వదిలేస్తున్నారు. జిల్లాల పరిధిలోని కాలుష్య సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. కాకినాడ గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం, రాజమహేంద్రవరం ఇతర ప్రాంతాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది.

- తాడి ప్రసాద్‌, ఛైర్మన్‌, సొసైటీ ఫర్‌ బెటర్‌ లివింగ్‌


అలా వదిలేస్తే చాలా ఇబ్బంది..

రొయ్యల ఫ్యాక్టరీ వాళ్లు మురికి నీరంతా శుభ్రం చేయకుండా కాలువల్లోకి వదిలేస్తున్నారు. పశువులు కూడా తాగడానికి పనిచేయడంలేదు. తాగితే చనిపోయే పరిస్థితి ఉంది. కొన్ని సమయాల్లో పంటలకు వాడుకోవాలన్నా పనికిరావడంలేదు. నీళ్లు కంపుగొడుతున్నా.. రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.

- సత్తిబాబు, రైతు, పనసపాడు, సామర్లకోట మండలం


అతిక్రమిస్తే చర్యలు

పరిశ్రమల్లో వ్యర్థాలు శుద్ధిచేసే ప్రక్రియ సమర్థంగా సాగాలి. అతిక్రమిస్తే చర్యలు తప్పవు.  రాజమహేంద్రవరంలో పేపర్‌ మిల్లు కాలుష్యం వివాదంపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తాం.

-అశోక్‌కుమార్‌, పర్యావరణ ఇంజినీరు, కాలుష్య నియంత్రణ మండలి

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు