logo

ఆక్వా సంక్షోభం.. ఉపాధికి సంకటం

డాలర్‌ సేద్యంగా పేరుగాంచిన ఆక్వా రంగం ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. ఓ వైపు నిలిచిన ఎగుమతులు, చుట్టుముడుతున్న వ్యాధులతో ఆక్వా రైతులు సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.

Published : 07 Dec 2022 02:51 IST

కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ఆందోళన చేస్తున్న ఆక్వా అనుబంధ సంస్థల సిబ్బంది

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: డాలర్‌ సేద్యంగా పేరుగాంచిన ఆక్వా రంగం ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. ఓ వైపు నిలిచిన ఎగుమతులు, చుట్టుముడుతున్న వ్యాధులతో ఆక్వా రైతులు సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విపత్కర పరిస్థితులు తట్టుకోలేక రైతులు సాగు విరమించుకుంటే వేలాదిమంది ఉపాధికి దూరమవుతారని వాపోతున్నారు.

రైతులకు అందని ప్రోత్సాహం

ఆక్వా సాగులో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే డీలర్లుసైతం చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఆక్వా రైతులకు మేతలు,  ఔషధాలు, ఇతర సామగ్రి అరువు ఇవ్వలేమని చెప్పేస్తున్నారు. ఒకవేళ అప్పుచేసి కొన్నా.. పంట ఉత్పత్తులు తీసుకుంటామని హామీ ఇవ్వలేమని వ్యాపారులు చెబుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.

భవిష్యత్తు.. డోలాయమానం

చిన్న, సన్నకారు రైతులు చెరువు తవ్వుకుని రొయ్య పిల్లల్ని చెరువుల్లో వదిలిన తరువాత మేత, మందులు తదితరాలన్నిటికీ అరువు ఇచ్చే డీలర్లపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో డీలర్లు ఆక్వా సాగుకు ముందస్తు పెట్టుబడికి వెనుకంజ వేయడం.. ఆక్వా సాగు భవిష్యత్తును డోలాయమానంలో పడేస్తోంది.

వేలాదిమందికి ఆసరాగా..

ఆక్వా రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి బతుకునిస్తోంది. ఒకప్పుడు జిల్లాలో వ్యవసాయ రంగం అతిపెద్ద ఉపాధి రంగంగా ఉండేది. కొన్నేళ్లుగా ఆ స్థానాన్ని ఆక్వా ఆక్రమించించి. ఈ రంగంలో వివిధ విభాగాల్లో యువత నుంచి పెద్ద వయసు వారి వరకు అనేక మంది ఉపాధి పొందుతున్నారు.

యువతలో ఆందోళన..

అనేక మంది ఉన్నత చదువులు చదివినవారు ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాల్లేక ప్రైవేటు రంగంలోకి వస్తున్నారు. ఆక్వా రంగం ఎందరో యువతకు మేతల కంపెనీల ప్రమోటర్లుగా, వ్యాధి నిర్ధారణ నిపుణులుగా, రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో టెక్నీషియన్లుగా, ఔషధాల కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లుగా.. ఉన్నారు. ఆక్వా రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో ఈ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఎక్కడికక్కడ నిలిపివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఆయా విభాగాల్లో పనిచేస్తున్నవారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్నారు.

అనుబంధ సంస్థలకూ ఇబ్బందే..

సంక్షోభం తీవ్రమైతే ఆక్వారంగానికి అనుబంధ సంస్థలైన రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రాలు, వ్యాధి నిర్ధారణ, ల్యాబ్లు, ఐస్‌ పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉంది. ఆధారిత కుటుంబాలకు ఇది పెద్ద కుదుపే అవుతుంది. మంగళవారం ఆక్వా ప్రొఫెషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆక్వా పరిశ్రమకు ప్రోత్సాహం కోరుతూ అమాలాపురంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. డీఆర్వో సత్తిబాబుకు వినతిపత్రం ఇచ్చారు.

కారణాలు ఇవే..

మన రాష్ట్రం నుంచి విదేశాలకు అప్పుడప్పుడూ రొయ్యల ఎగుమతులు నిలిచినా వారంపది రోజుల్లో మళ్లీ పుంజుకోవడంతో పెద్దగా సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు. కొన్ని నెలలుగా థాయ్‌లాండ్‌, అమెరికా, చైనా వంటి దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ సంక్షోభ పరిస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.


దేశీయ వినియోగం పెరగాలి

విదేశాలకు మనం ఏటా 3లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి చేస్తున్నాం. దీనిలో 50శాతం స్వదేశీ వినియోగం ఉన్నా.. ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేదికాదు. రొయ్యలు తినడం వల్ల వ్యాధుల బారినపడతామని ప్రజల్లో అపోహ ఉంది. దానిని నివృత్తి చేసేందుకే మంగళవారం అమలాపురంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందించాలి.

పి.రత్నరాజు, అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


క్షేత్రస్థాయిలో అండగా నిలవాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిస్తేనే సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి విదేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి.         

శ్రీహరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని