logo

యువతా మేలుకో... ఓటు నమోదు చేసుకో..

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2023కు ఇక రెండు రోజులే గడువుంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత నెల తొమ్మిది నుంచి ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, ఓటు తొలగింపు, బదిలీ, తొలగింపునకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా దీనికి ఈ నెల 8 వరకు అవకాశం ఉంది.

Published : 07 Dec 2022 02:51 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం), కడియం

ఓటు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎన్నికల నమోదు అధికారి దినేష్‌కుమార్‌(పాత చిత్రం)

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2023కు ఇక రెండు రోజులే గడువుంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత నెల తొమ్మిది నుంచి ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, ఓటు తొలగింపు, బదిలీ, తొలగింపునకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా దీనికి ఈ నెల 8 వరకు అవకాశం ఉంది. ఓటరుగా నమోదు చేయించుకునే విషయంలో యువత కొంచెం వెనుకబడి ఉంది.

జిల్లాలో 18-19 మధ్య వయస్సున్న యువత 48 వేల మంది ఉండగా వీరిలో 7,800 మంది మాత్రమే ఓటరుగా నమోదు అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. యువతకు ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 1,559 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 15,41,332 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7,56,380 మంది, మహిళలు 7,84,833 మంది, ఇతరులు 119 మంది ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల ద్వారా వివరాల నమోదు కోసం ప్రత్యేక సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. గత నెల 9 నుంచి ఇప్పటివరకు 17,854 మంది దరఖాస్తులు అందించగా వీటిలో కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసినవారు 8,984 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో ఓటు నమోదు, మార్పులు, చేర్పులు, బదిలీలకు మొత్తం 7,688 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లోనూ అవకాశం

కొత్తగా ఓటు నమోదుకు ఈ రెండ్రోజుల్లో దరఖాస్తు చేసుకున్న యువతకు వచ్చే ఏడాది జనవరి 5న ప్రచురించే జిల్లా తుది ఓటర్ల జాబితాలో ఓటుహక్కు కల్పిస్తారు. ఆన్‌లైన్‌లోనూ www.nvsp.in వెబ్‌సైట్‌ ద్వారా, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటు నమోదుకు అవకాశం ఉంది. వచ్చేనెల 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని