logo

నేటినుంచి రబీ సాగుకు సన్నాహాలు

గోదావరి పరిధిలోని మూడు డెల్టాల్లో సుమారు 8,96,507 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పు, మధ్య డెల్టాలకు రబీకి గత నెల 30 నుంచే సాగునీటిని విడుదల చేస్తున్నారు.

Published : 07 Dec 2022 02:51 IST

విజ్జేశ్వరం హెడ్‌స్లూయిస్‌ నుంచి సాగునీరు విడుదల

నిడదవోలు: గోదావరి పరిధిలోని మూడు డెల్టాల్లో సుమారు 8,96,507 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పు, మధ్య డెల్టాలకు రబీకి గత నెల 30 నుంచే సాగునీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమడెల్టాకు బుధవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. రబీ అవసరాలకు సంబంధించి గోదావరిలో 101 టీఎంసీల నీరు ఉందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. సాధారణంగా పశ్చిమడెల్టా పరిధిలో ఏటా డిసెంబరు 1 నుంచి రబీసాగు చేపట్టేవారు. ఈసారి అధిక వర్షాలు ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.

నామమాత్రంగా కాలువల నిర్వహణ..

రబీలో సాగునీటి ఎద్దడి ఎదురవుతుంది. కాలువల నిర్వహణ తూతూమంత్రంగా చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలువల్లో అక్కడక్కడ తూడు, గుర్రపుడెక్క, పూడిక తొలగింపు వంటి పనులు చేపట్టారు. నిడదవోలు నియోజకవర్గంలో పెండ్యాల ఎత్తిపోతల పథకం కింద 6,600 ఎకరాలు, కానూరు కాలువ కింద 2,700 ఎకరాలతో పాటు, పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో సుమారు 12వేల ఎకరాల్లో రబీ సాగువుతుంది.

పెండ్యాల పథకం పరిధిలో..

పెండ్యాల పథకం పరిధిలోని కాలువలో పలుచోట్ల చెట్లు పడి ఉన్నాయి. చాలావరకు పూడిక, గుర్రపుడెక్క, తూటుకాడ ఉంది. ్య కానూరు కాలువలోనూ గుర్రపుడెక్క అధికంగా ఉంది. అధికారులు ఇప్పుడు తొలగింపు పనులు చేపట్టారు. ఈరెండు కాలువల్లో స్లూయిస్‌లు చాలా వరకు దెబ్బతిన్నాయి. వాటికి కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. అప్పారావు ఛానల్‌లో నిడదవోలు చిన్నకాశీరేవు వద్ద చెట్టు అడ్డంగా ఉంది. వీటిని తొలగిస్తేనే సాగునీరు అందుతుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.


నిర్వహణ పనులు చేస్తాం...

రబీకి సంబంధించి గోదావరిలో నీటి లభ్యత పూర్తిగా ఉంది. కాలువల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ఓఅండ్‌ఎం కింద పనులు చేపడుతున్నాం. నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ప్రాంతాల్లో గుర్రపుడెక్క, తూటుకాడ ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. పెండ్యాల, కానూరు కాలువల్లో కూడా చేస్తున్నాం. వేసవిలో శాశ్వత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం.

దక్షిణమూర్తి, ఈఈ, పశ్చిమడెల్టా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని