logo

మట్టి అక్రమ తరలింపుపై కొరడా

మండలంలోని పెద్దనాపల్లి పరిధిలో ఉన్న పోలవరం కాలువ మట్టి అక్రమ తరలింపుపై యంత్రాంగం కొరడా ఝుళిపించింది.

Updated : 07 Dec 2022 04:17 IST

ఏలేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద స్వాధీనం చేసుకున్న టిప్పర్లు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దనాపల్లి పరిధిలో ఉన్న పోలవరం కాలువ మట్టి అక్రమ తరలింపుపై యంత్రాంగం కొరడా ఝుళిపించింది. కొందరు రాజకీయ నాయకుల ఆశీస్సులతో రాత్రి వేళ అడ్డు అదుపు లేకుండా యంత్రాలతో మట్టి తవ్వి వాహనాల్లో తరలిస్తూ ప్రైవేట్‌ పనులకు వినియోగిస్తున్న వైనంపై ‘కాలువ మట్టి .. కొల్లగొట్టి’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మట్టి దందా పట్టించుకోని సంబంధిత అధికారులపై కలెక్టర్‌ కృతికాశుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆదేశాల మేరకు ఏలేశ్వరం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తహసీల్దారు విశ్వనాథశాస్త్రి సూచనలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.పొన్నాలు, స్థానిక వీఆర్వో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టి తరలింపుపై నివేదికను జిల్లా యంత్రాంగానికి అందజేస్తామన్నారు. జగ్గంపేటలోని పోలవరం కార్యాలయ ఏఈ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు రెండు భారీ టిప్పర్లు, ఒక యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలవరం కాలువకు సంబంధించిన మట్టి తరలింపునకు ఏ విధమైన అనుమతులు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలవరం అధికారులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని