తీరాన్ని కమ్మేసి.. తీరుగా కాజేసి
ఘాటైన వాయువులు.. తేలియాడే రసాయన వ్యర్థాలు.. కుప్పలు తెప్పలుగా పరిశ్రమల వ్యర్థాలు.. ఇదీ కాకినాడ గ్రామీణ తీరం పరిస్థితి. జన ఘోష అధికారులకు పట్టకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణం.
ఈనాడు - కాకినాడ
ఘాటైన వాయువులు.. తేలియాడే రసాయన వ్యర్థాలు.. కుప్పలు తెప్పలుగా పరిశ్రమల వ్యర్థాలు.. ఇదీ కాకినాడ గ్రామీణ తీరం పరిస్థితి. జన ఘోష అధికారులకు పట్టకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణం. ఫార్మా, రసాయన వ్యర్థాల మాఫియా రెచ్చిపోతూ.. ఎక్కడ్నుంచో తెచ్చిన హానికర వ్యర్థాలు, రసాయన వ్యర్థ జలాలు కాకినాడ తీరం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో పారబోస్తోంది. ఘాటైన వాసనలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అధికారులు మాఫియా మెడలు వంచడం లేదు. పరిస్థితులు గతి తప్పిన వేళ తీరాన్ని రసాయనాలు కమ్మేస్తుండగా.. రాజకీయులు, అక్రమార్కులు ఒక్కటై ప్రజా రోగ్యాన్ని, భవితవ్యాన్ని కాజేస్తున్న దారుణమిది.
ఏడీబీ రోడ్డులో ఆయిల్ ట్యాంకర్లు శుభ్రం చేస్తున్న ప్రాంతం
* కాకినాడ గ్రామీణంలో గత నెల 20న రాత్రి.. ఘాటైన వాసనతో ప్రజలు తల్లడిల్లారు. స్థానికుల ఫిర్యాదుతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించారు. ఓ మూతపడిన పరిశ్రమ ప్రాంగణంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ (ఫార్మా) వ్యర్థాలు భారీగా పారబోసినట్లు గుర్తించారు. నిలిపి ఉన్న ట్యాంకర్లు పరిశీలిస్తుండగా.. ఫార్మా వ్యర్థాలు పారబోసిన ట్యాంకరును నేమాం వద్ద గుర్తించారు. సేకరించిన నమూనాలు పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపి జేసీకి నివేదించారు.
* వాకలపూడి ప్రాంతంలో జూన్‌లో 30 కిలోలీటర్ల ఫార్మా వ్యర్థాలను ట్యాంకరుతో గుర్తుతెలియని వ్యక్తులు పారబోయగా స్థానికులు ఇబ్బంది పడ్డారు.
* పిఠాపురం మండలంలో ట్యాంకర్‌తో 10 కిలోలీటర్ల హానికర వ్యర్థాలు పారబోయడం గతంలో వివాదాస్పదమైంది. స్థానికుల ఫిర్యాదుతో పీసీబీ అధికారులు వాహనాన్ని సీజ్‌చేసి పోలీసులకు అప్పగించారు.
బరి తెగిస్తున్నారిలా..
నేమాం వద్ద పట్టుబడిన ట్యాంకరు
కాకినాడ తీరంలో ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమలు తొమ్మిది ఉన్నాయి. వెయ్యి వరకు ట్యాంకర్లు సరకుతో రాకపోకలు సాగిస్తుంటాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు సరకుతో వెళ్లి ఖాళీ ట్యాంకర్లుగానీ, ఇతర నిల్వలతోగానీ తిరిగొస్తాయి. బేరాలు లేని ట్రిప్పుల్లో కొన్ని పరిశ్రమలతో లోపాయికారీ ఒప్పందంతో.. విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల నుంచి ఫార్మా, ఇతర రసాయన వ్యర్థాలు ట్యాంకరులో తెచ్చి నిర్మానుష్య ప్రదేశాల్లో పారబోస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలకు శుద్ధి చేసే ఖర్చు తగ్గడం.. వాహన యాజమాన్యాలకు బేరాలు దక్కడంతో వ్యవహారం సాగిపోతోంది. ఇది తెలిసిన కొందరు నాయకులు సొమ్ము చేసుకుంటూ.. రాజకీయ ఒత్తిళ్లతో చర్యలకు అడ్డుతగులుతున్నారు. కాకినాడ గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం తదితర మండలాలు, జాతీయ రహదారి పక్కన వ్యర్థాల జాడ అడపాదడపా కనిపిస్తోంది. హైవేపై ఇటీవల నిఘా పెరగడంతో అక్రమార్కులు తీరాన్ని ఎంచుకున్నారు.
ప్రజారోగ్యంతో ఆటలు..
ట్యాంకర్ నుంచి వదులుతున్న కలుషిత వ్యర్థాలు
కాకినాడ నుంచి వంట నూనెలు లోడ్‌తో వెళ్తున్న లారీలు తిరిగి వస్తూ వ్యర్థాలు తెచ్చి పారబోస్తున్నాయి. తర్వాత ట్యాంకు లోపల వాటర్ సర్వీసింగ్ చేయించి మళ్లీ వంటనూనె తరలింపునకు వాడుతున్నారు. వెరసి వ్యర్థాల అవశేషాలు లోపలే ఉండటంతో మళ్లీ లోడ్ చేసిన వంటనూనెలు ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. రిఫైనరీల్లో వంట నూనెల కోసం లారీలను తీసుకెళ్లినప్పుడు కొన్ని పరిశ్రమల్లో తనిఖీ సరిగా లేకున్నా బాగున్నట్లు పచ్చజెండా ఊపుతున్నారు. పరిశ్రమలపై పెత్తనమంతా నాయకులు, వారి అనుచరులదే కావడంతో వ్యవహారం సాగిపోతోంది.
వదిలేస్తే పోలా..
తీరానికి వెళ్లే దారిలోని కాలువలో రసాయన వ్యర్థాలు
* కాకినాడ గ్రామీణంలో ట్యాంకర్ల శుద్ధి యూనిట్లు పదికిపైనే ఉన్నాయి. వ్యర్థాలు, ఇతర నిల్వలతో వచ్చే ట్యాంకర్లను శుద్ధి చేస్తారు. నిత్యం వందకుపైనే ట్యాంకర్లను యాసిడ్ ఇతర రసాయనాలతో శుద్ధిచేసేటప్పుడు ఆయిల్, వ్యర్థాలన్నీ కాలువల ద్వారా కడలిలో కలుస్తున్నాయి. ఆయిల్ రిఫైనరీల నుంచి పామాయిల్ లోడ్‌లతో రాష్ట్రంతోపాటు.. తెలంగాణలో వివిధ ప్రాంతాలకు రోజూ వందల లారీలు కిరాయికి వెళ్తాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, పంగిడి ప్రాంతాల నుంచి వ్యర్థాలు తెచ్చి జన సంచారం లేని చోట పారబోస్తున్నారు.
* పీసీబీ నిబంధనల ప్రకారం పరిశ్రమ వ్యర్థాలను శుద్ధిచేసి.. వ్యవసాయ, ఇతర అవసరాలకు వాడాలి. ఆ లెక్క అధికారికంగా చూపాలి.. శుద్ధి వసతి లేకుంటే.. హానికర వ్యర్థాలను ట్యాంకర్లతో విశాఖ రాంకీ ఫార్మాకు పంపాలి. తీవ్రత మేరకు టన్నుకు రూ.5-10 వేలు శుద్ధికి చెల్లించాలి. రవాణా ఖర్చులు కాక లారీకి రూ.లక్ష వెచ్చించాలి. నిర్వహణ, శుద్ధి ఖర్చులు రూ.లక్షల్లో అవుతాయి. వీటిని తప్పించుకోడానికి కొందరు బరితెగిస్తున్నారు.
బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు
అశోక్ కుమార్, పర్యావరణ ఇంజినీరు, కాలుష్య నియంత్రణ మండలి
ఫార్మా, ఇతర వ్యర్థాలు తీరంలో పారబోస్తున్నారు. తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా తనిఖీలు చేపట్టి నమూనాలు పరీక్షకు పంపాం. ఆ నివేదిక రావాలి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి తెస్తున్నారు. వ్యర్థాలను పంపుతున్న వారినీ గుర్తించి చర్యలు తీసుకుంటాం. గ్రామీణంలో అనధికారిక ట్యాంకర్లు శుభ్రపరిచే కేంద్రాలపైనా దృష్టి సారిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
-
Politics News
Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీ పదవికి థోరట్ రాజీనామా!